Nadendla Manohar Pressmeet : జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను ఈనెల 14న మచిలీపట్నంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభలో రాష్ట్ర భవిష్యత్తు పై జనసేన కార్యాచరణను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెల్లడిస్తారని మనోహర్ తెలిపారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో సభను నిర్వహిస్తున్నామని మనోహర్ తెలిపారు. సభ నిర్వహించే రోజు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి మచిలీపట్నం చేరుకుంటారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే 175 నియోజకవర్గాలలో రహదారులు నిర్మించే ధైర్యం ఉందా..? అని మనోహర్ ప్రశ్నించారు. ఐపాక్ లేకుండా ఏ పని చేయని మీరా... మాకు సవాల్ విసిరేది అని నిలదీశారు. నాయకత్వ లోపం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని మనోహర్ ఆరోపించారు. పెట్టుబడులు రాని సమ్మిట్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తోందని విమర్శలు గుప్పించారు.
వర్తమాన రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా.. సామాన్యుడి గళం వినిపించేలా జనసేన చేస్తున్న కృషి ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా.. పార్టీ ఏ కార్యక్రమం చేసినా జనసైనికులు, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అందరి భాగస్వామ్యంతో ప్రతీ కార్యక్రమాన్ని పవిత్రంగా భావించి విజయవంతం చేశారు. జనసేన పార్టీ ఏర్పాటై 9సంవత్సరాలు పూర్తయ్యాయి.. పదో వార్షికోత్సవ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించాం. సభను కలిసికట్టుగా విజయవంతం చేయడంతో పాటు భవిష్యత్ నిర్ణయాలు ప్రకటించాలని తీర్మానించాం. సభ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఆదేశించారు. మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటించినపుడు రైతాంగం కష్టాలపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోగా, పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం తెలిసిందే. సభ సందర్భంగా రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగాలు చేసిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు సహా మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ ను కూడా స్మరించుకోవాలి. సభ వేదికకు పొట్టి శ్రీరాములుగా నామకరణం చేయనున్నాం. సభలో పాల్గొనేందకు పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి వారాహి వాహనంలో సాయంత్రం 5గంటలకు బయల్దేరి వస్తారు. దారి పొడవునా ప్రజలను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటారు. మన భవిష్యత్ కోసం, మన కోసం, రైతులకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని పవన్ ఆదేశించారు. - నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ సభ్యుడు
ఇవీ చదవండి :