Munugode Bypoll Campaign Ended: తెలంగాణ మునుగోడులో ప్రచారపర్వం ముగిసింది. పార్టీలు, నేతల వాగ్భాణాలు, విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన ప్రచారపర్వానికి నేటితో తెర పడింది. ఇక అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఓటరు మహాశయుని చేతిలోని పాశుపతాస్త్రం, అత్యంత విలువైన ఓటుహక్కుతో తీర్పును నిక్షిప్తం చేసే సమయం ఆసన్నమవుతోంది. గురువారం రోజు జరగనున్న పోలింగ్‌లో మునుగోడు తదుపరి శాసనసభ్యుడిని నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855 మంది ఉండగా.. అందులో పురుషులు లక్షా 21 వేల 662 మంది.. మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు. ఓటర్ల వర్గీకరణ చూస్తే అత్యధికంగా 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య 64 వేల 721 మంది ఉండగా.. 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో 47,430 ఓటర్లున్నారు. 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు 32,120 మంది.. 26 నుంచి 30 ఏళ్ల మధ్యలో 28,204 మంది ఓటర్లు ఉన్నారు. 20,472 మంది 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు కాగా.. 61 నుంచి 70 ఏళ్ల మధ్య 19,655 మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో దివ్యాంగులు 5,686 మంది ఉన్నారు. 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. 798 మంది ఈ సదుపాయాన్ని ఎంచుకోగా.. అందులో 685 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
47 మంది అభ్యర్థులు.. 298 పోలింగ్ కేంద్రాలు..: గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు 10 శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు.
వంద చెక్ పోస్టుల ఏర్పాటు..: సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 105 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎన్నికల విధుల కోసం 3366 మంది రాష్ట్ర పోలీసులను వినియోగించారు. 15 కంపెనీల కేంద్ర బలగాలు కూడా నియోజకవర్గానికి వచ్చాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మండలానికి రెండు చొప్పున 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 14 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, మరో 14 వీఎస్టీ బృందాలు పని చేయనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పర్యవేక్షణ కోసం 7 మండలాలు, 2 మున్సిపాల్టీలకు ఒకటి చొప్పున తొమ్మిది బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం 51 బృందాలు పర్యవేక్షణలో ఉండనున్నాయి. ప్రలోభాల పర్వాన్ని నిరోధించేందుకు ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. నియోజకవర్గ సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో వంద చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఏడు మంది ఐటీ ఆధికారుల నేతృత్వంలో బృందాలు, జీఎస్టీ బృందాలు మునుగోడులో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తనిఖీలు చేస్తున్నాయి.
ఇవీ చూడండి..