బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న విషయం ముఖ్యమంత్రి జగన్కు కనిపించలేదా అంటూ.. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కుదింపు.. బీసీల ద్రోహం కాదా అని నిలదీశారు. విద్య, ఉద్యోగం, ఉపాధి ఎందులో న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీల సంక్షేమం, అభ్యున్నతి గురించి వైకాపా నేతలు మాటలు హాస్యాస్పదమని అనగాని సత్యప్రసాద్ అన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి వంచించారని ఆరోపించారు. 37 మంది ఉండే తితిదే బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 సీట్లు ఇవ్వడం మోసం కాదా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి, 16వేల మందికి రాజకీయ అవకాశాలు నాశనం చేసి.. బీసీలకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షల వేతనాలొచ్చే పదవులు సొంతవాళ్లకు కట్టబెట్టి.. ప్రాధాన్యం లేని పదవులు బీసీలకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాల పేరుతో బీసీల 4వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారన్నారని ఆరోపించారు. 14 నెలల కాలంలో బీసీ కార్పొరేషన్ రుణం ఇవ్వలేదన్న అనగాని సత్యప్రసాద్.. బీసీ కార్పొరేషన్ నుండి 3,432 కోట్లు అమ్మ ఒడికి మళ్లించడం దుర్మార్గమన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నిలిపినపుడు మంత్రి శంకరనారాయణ ఏమయ్యారని.. ఇప్పటికైనా జగన్ భజన మాని బీసీల అభ్యున్నతి కోసం గళం విప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'కొవిడ్ ఆస్పత్రుల సంఖ్య పెంచాలి.. ప్రజల్లో ధైర్యం నింపాలి'