రాష్ట్రంలో రైతు రాజ్యస్థాపనకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే వ్యవసాయాభివృద్ధికి, రైతుల శ్రేయస్సుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కృష్ణాజిల్లా నందిగామలో వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు శంకుస్థాపన చేశారు.
సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు రైతులకు మరింత చేరువగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. భూసార పరీక్షను అనుసరించి ఏ ఎరువులు ఉపయోగించాలో రైతులకు సలహా ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి ప్రయోగశాలకు 81 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు.
నందిగామ నియోజకవర్గంలోని నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల మండలాల రైతులు ఈ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు పిల్లి పెసర, జిలుగు విత్తనాలను ఎమ్మెల్యే మెుండితోక జగన్మోహన్ రావు పంపిణీ చేశారు.