కృష్ణా జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల చేతికొచ్చిన పంటను రైతులు అమ్ముకునే వీలు కనిపించడం లేదు. పంట సాగుకు లక్షల్లో ఖర్చు చేసిన అన్నదాతలు... పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. గతంలో వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వచ్చి మిర్చిని కొనుగోలు చేసేవారు. కరోనా నేపథ్యంలో వ్యాపారులు గ్రామాల వైపు తొంగి చూడటం లేదు. చేసేదేమీలేక పండించిన పంటను అంతా శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు రైతులు. జిల్లాలో ఉన్న 20 శీతల గిడ్డంగుల్లో మిర్చిని నిల్వ చేస్తున్నారు. గతంలో అయితే రైతులు నిల్వచేసిన మిర్చికి బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. కానీ ఈ ఏడాది రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించటంతో కర్షకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోనే కొన్ని శీతల గిడ్డంగుల నిర్వాహకులు అధిక ప్రైవేటు వడ్డీలతో రైతులకు అప్పులు ఇస్తూ దోచుకుంటున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించి శీతల గిడ్డంగుల్లో నిల్వచేసిన మిర్చికి రుణాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి