YSR SEED RESEARCH AND TRAINING CENTER: కృష్ణా జిల్లా గన్నవరంలో 46 కోట్ల రూపాయలతో వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైయస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్.. మినిస్టర్ రోజా, ఎమ్మెల్యే వంశీ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. జాతీయ స్థాయిలో కేవలం వారణాసిలో మాత్రమే జాతీయ విత్తన పరిశోధన కేంద్రం ఉందని.. కానీ మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ సంకల్పించడం రైతు సంక్షేమం కోసం ఆయనకున్న చిత్తశుద్ధిని సూచిస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో రైతులకు వ్యవసాయపరమైన సూచనలు, సలహాలు అందిస్తూ వారికి సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10వేల 778 రైతు భరోసా కేంద్రాలు, అన్ని నియోజకవర్గాలలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. విత్తనం మంచిదైతే మంచి దిగుబడి వస్తుందని అందువల్ల ప్రధానంగా విత్తనం మీద దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆర్బీకేల్లో ఉన్న వ్యవసాయ, మత్స్య సహాయకులకు విత్తన పరిశోధనపై తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. జన్యుపరమైన, డీఎన్ఏ టెస్టులు కూడా ఇక్కడ నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు ఈ పరిశోధన కేంద్ర వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశోధన కేంద్రాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
రైతు బాగుంటే దేశం బాగుంటుందని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. అన్ని వాతావరణాలను తట్టుకుని మంచి దిగుబడులనిచ్చే విత్తనం రైతులకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అతి పెద్ద వైయస్సార్ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రాన్ని 46 కోట్ల రూపాయలతో 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతుల సంక్షేమానికి రైతు భరోసా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ఉండి.. వారి ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రి జగనన్నకు రైతులు అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, MD శేఖర్ బాబు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ జే.రాఘవరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
శంకుస్థాపనకు ఆహ్వానం లేదని గన్నవరం వైసీపీ నాయకుల అసంతృప్తి: కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ నాయకులు అధిష్ఠానంపై అసంతృప్తి తెలిపారు. స్థానిక APSSDC జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన ఆహ్వానం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై గన్నవరం మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ అంజనీ కుమారి పేరు లేదంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో హాజరైన పట్టణానికి చెందిన అరకొర ప్రజా ప్రతినిధులు, నాయకులు.. ముందస్తు సమాచారం లేకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. స్కూల్ అటెండర్, అతడి స్నేహితులు కలిసి..
నలుగురిలో ఆ ఇద్దరు ఎవరో..? షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలపై పోస్టుమార్టం పనిలో వైఎస్సార్సీపీ
2018లో ఎంగేజ్మెంట్.. మలేసియా గుడిలో సీరియల్ నటి సీక్రెట్ వెడ్డింగ్!