Vidadala Rajini about Transfers and Aarogyasri Bills: వైద్యుల పరస్పర బదిలీలు అర్హత ఉన్నవారికే అనుమతినిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వైద్యుల పరస్పర బదిలీల్లో పారదర్శకత లేదన్న ఆరోపణలు.. కొంతమందికి మాత్రమే బదిలీలకు అనుమతినిస్తున్నారని వైద్య వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. దీంతో అన్ని అంశాలను పరిశీలించే బదిలీలు చేస్తున్నామని మంత్రి రజిని తెలిపారు.
బిల్లుల చెల్లింపు పట్ల సంతృప్తిగా ఉన్నాయి: అదే విధంగా ఆరోగ్యశ్రీ బిల్లులు విడతల వారీగా ఇస్తున్నామని.. అనవసరమైన ఆరోపణలు తమపై చేస్తున్నారని మంత్రి అన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ హాస్పిటల్స్ బిల్లుల చెల్లింపు పట్ల సంతృప్తిగా ఉన్నాయని, సంతోషంగా వైద్య సేవలు అందిస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ హాస్పిటల్స్‌కు సాధ్యమైనంత త్వరగా బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
భోదనాసుపత్రుల సూపరింటెండెంట్, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని విజయవాడలోని ఓ హోటల్లో ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలను అందించటానికే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 ప్రొసీజర్లకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
భారీస్థాయిలో వైద్యుల నియామకాలు చేపట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కళాశాలలు రానున్నాయని అన్నారు. ఇప్పటికే విజయనగరం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు ఎన్ఎంసి అనుమతించిందన్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో మెడికల్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తున్నామని వెల్లడించారు.
"ప్రతి ఒక్కరూ.. వాళ్లు ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడే పుట్టాను ఈ ఊరిలోనే చదువుతాను.. వేరే ఊరికి వెళ్లను, వేరే జిల్లాకు వెళ్లను అనే ఆలోచన మనం చేయము కదా. మనం ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నప్పుడు పరిస్థితిని బట్టి ఎక్కడ సీటు వస్తే ఎక్కడకి అయినా వెళ్లి చదువుకుంటాం. చదువుకున్నప్పుడు మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో.. అదే విధంగా సర్వీస్ చేసేటప్పుడు కూడా అదే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాం. మీరు అందరికీ సేవ చేయాలి, అన్ని ప్రదేశాలకు వెళ్లాలి. ప్రస్తుతం వీలైనంత వరకూ కొంతమందికి.. సరైన కారణాలు ఉంటే వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాము. కానీ అందరూ అలాగే చేస్తాము అంటే అది ఎలాంటి పరిస్థితో దయచేసి ఆలోచించి సహకరించాలని కోరుకుంటున్నాను". - విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి: