మూడవ దశ కొవిడ్ సంసిద్ధతపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారులతో మంత్రి పేర్ని నాని కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా మొదటి, రెండవ దశల్లో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. దేశంలో మూడవ దశ కరోనా ప్రబలుతుందనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నందున.. ప్రజల ఆరోగ్య రీత్యా అత్యవసర సేవలు అందించాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఒక వైద్యుడు సర్జికల్ గ్లోవ్స్, మాస్కులు తగినంతగా సరఫరా కావడం లేదని బడ్జెట్ కేటాయింపులో తగ్గించివేశారని తెలిపారు. మధుమేహ పరీక్షలు జరిపే గ్లూకో మీటర్, స్టిక్స్ లభ్యతపై మంత్రి ఆరా తీశారు. మొబైల్ ఎక్స్ రే యూనిట్ అవసరత గూర్చి మరో వైద్యుడు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వాసుపత్రికి స్థానిక బెల్ కంపెనీ యాజమాన్యం అందించిన వెంటిలేటర్లకు వారి ఇంజినీర్లతో సర్వీస్ చేయించి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి అన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లభ్యతను అధికం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల మౌళిక సదుపాయాలు పెంపొందించుటకు ఇంకా ఏమేమి కావాలో తన దృష్టికి తీసుకురావాలని మంత్రి అన్నారు.
కరోనా బాధితులకు అందించేందుకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని, వారికి నాణ్యమైన భోజనం, అవసరమైన మందులను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎవరైనా కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వస్తే 15 నిమిషాల వ్యవధిలో అడ్మిషన్ తీసుకుని వైద్య చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో విలేజ్ ఐసోలేషన్లు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలు కూడా వినియోగంలో ఉంటాయన్నారు. ఇందులో కావలసిన బెడ్స్, మందులు ఇతర సౌకర్యాలను ఇప్పటి నుండే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా వైద్య సేవలు అందాలని, పరిస్థితులకు అనుగుణంగా మందులు, పరికరాలు వినియోగించుకునేందుకు పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించుటలో నిర్లక్ష్యం వహించకూడదని పేర్కొంటూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
lokesh letter to cm: ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగాఉంది.. ఆదుకోండి