Minister Amarnath on Investments : ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చంద్రబాబు హోదా వద్దన్నప్పుడే కేంద్రం చెప్పేసిందని.. ఇప్పుడు కొత్తగా చెప్పలేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రాకున్నా.. చంద్రబాబుకు ప్యాకేజీ అందిందని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రచార రథం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటే.. ఇక్కడ పర్యటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నిబంధనల మేరకే అధికారులు నడుచుకుంటారని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని పెట్టుబడుల పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం: రాష్ట్రంలోని పెట్టుబడులపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నట్టు చంద్రబాబు చెబుతున్నప్పటికీ.. కేవలం రూ.34 వేల కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ స్టీల్ ముందుకు వచ్చిందని.. 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.8,800 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు.
భవిష్యత్లో 4.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేలా ప్రణాళిక చేశారన్నారు. సోలార్, విండ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయని వెల్లడించారు. 30 చోట్ల ఈ స్టోరేజ్ ప్రాజెక్టులకు అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల మెగావాట్ల ప్రాజెక్టుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతినిచ్చిందని.. ఇంకా 10 వేల మెగావాట్ల పంప్డ్ ప్రాజెక్టులు పెట్టుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టలేం: అమర్ రాజా సంస్థ కాలుష్యంపై నోటీసులు ఇచ్చిన వ్యవహారం కోర్టుల్లో ఉందని చెప్పారు. ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి పరిశ్రమలకు అనుమతి తమ ప్రభుత్వం ఇవ్వదని స్పష్టం చేశారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ ప్రాజెక్టుల ద్వారా వస్తోందని.. ఇలాంటి ప్రాజెక్టులను టెండర్ల ద్వారా ఇవ్వలేమని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: