కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కృష్ణాజిల్లా మెువ్వ మండలంలో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. కూచిపూడి, నిడుమోలు మండలాల్లోని పలు గ్రామాల్లో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. జన సంచారం లేక రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలు మినహా ఎవరు బయటకు రావడం లేదు.
కోడూరులో వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ప్రధాన రహదారులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వాణిజ్య వ్యాపార సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు బృంధాలుగా విడిపోయి లాక్డౌన్ ను పరిశీలిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో...
జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు కావటంతో ప్రజల్లో భయం మరింత పెరుగుతోంది. ఫలితంగా తణుకు తదితర ప్రాంతాల్లో ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అంతేగాక ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలలోపే దుకాణాలు మూసివేసే కార్యక్రమం చేపట్టారు. కేసులు దృష్టిలో ఉంచుకొని తాడేపల్లిగూడెంలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకే దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిచ్చారు.
కర్నూలు జిల్లాలో...
జిల్లాలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున వ్యాపార సమయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకోవాలని నగర మేయర్ బీవై.రామయ్య వ్యాపారులను కోరారు. ఇదే అంశంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై. రామయ్య, కమిషనర్ బాలాజీ సమావేశం నిర్వహించారు.
విశాఖ జిల్లాలో...
విశాఖలో అంతకంతకూ కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. గాజువాక వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి గాజువాకలో స్వచ్ఛంద మినీ లాక్ డౌన్ అమలు చేయనుంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని వర్తక సంఘం ప్రతినిధులు చెప్పారు.
ఇదీ చదవండి:
ఆరో రౌండ్లో మమత దూకుడు- సువేందు వెనుకంజ