CJI Justice NV Ramana: రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. లావు వెంకటేశ్వర్లు సతీమణి లావు నాగేంద్రమ్మ పాదాలకు నమస్కరించిన సీజేఐ.. తనకు కన్నతల్లి లేని లోటును నాగేంద్రమ్మ తీర్చారన్నారన్నారు. తనను ఆశీర్వదించినందుకు నాగేంద్రమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.
అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం..
అనంతరం భారత న్యాయవ్యవస్థ-భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై సీజేఐ రమణ స్మారకోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం తర్వాత అభివృద్ధి, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లటంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. ఇంకా ఎన్నో సవాళ్లు మన ముందున్నాయన్నారు. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని, సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించామన్నారు. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిందని.., విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక సంస్కరణలు వచ్చాయన్నారు. భారత న్యాయవ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని..,వాటిని సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని.., రాజ్యాంగ పరిధుల మేరకు అందరూ పనిచేయాలన్నారు. న్యాయవ్యవస్థలో ప్రతీ చర్యకు స్థిరమైన రికార్డు ఉండాలన్నారు. న్యాయమూర్తలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యమన్న సీజేఐ.. ప్రస్తుతం హ్యాకింగ్ అతిపెద్ద సమస్యగా మారిందన్నారు.
దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి..
న్యాయమూర్తులపై జరుగుతోన్న దాడులపై సీజేఐ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో జడ్జిలపై భౌతిక దాడులు పెరిగాయని.., కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకూ ఆ దాడుల కేసులపై దర్యాప్తు జరగటం లేదన్నారు. ప్రస్తుతం న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతోన్న విషయాన్నీ ప్రస్తావించారు. చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని.., న్యాయస్థానాల్లో సరిపడా జడ్జిలు లేకపోవటం అందుకు కారణమన్నారు. జడ్జిలు సమాయాభావం లేకుండా కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారన్న సీజేఐ.. ప్రాసిక్యూటర్లను నియమించేందుకు ప్రత్యేక స్వతంత్ర కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు.
మాతృ భాషను మర్చిపోకూడదు..
సభలో పాల్గొన్న విద్యార్థులకు సీజేఐ పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాతృ భాషపై మమకారం పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించాలని, అదే సమయంలో మాతృభాష తెలుగును మరవకూడదన్నారు. తెలుగు సాహిత్యాన్ని చదవాలని, కన్నతల్లిని, తెలుగుభాషను, సంస్కృతి, సాంప్రదాయాలు, మూలాలను ఎన్నటికీ మర్చిపోవద్దని సూచించారు. సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడి మన భాష గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాలన్నారు.
తెలుగు గడ్డపై పుట్టి సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..సీజేఐ రాక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న అమరావతి రైతులు