Krishna District Registration Department Corruption: ఉమ్మడి కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖలో కొందరు అవినీతి అధికారుల గుట్టురట్టవుతోంది. తాజాగా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ బాలాజీ సింగ్‌పై అవినీతి నిరోధక శాఖ దాడులు కలకలం సృష్టించాయి. పక్కా ప్రణాళికతో అనిశా కేంద్ర బృందం ఈ దాడులు నిర్వహించింది. మూడు నెలలుగా సబ్ రిజిస్ట్రార్ ఆస్తులపై విచారణ చేసి ధ్రువీకరించుకున్న తర్వాత కేంద్ర బృందం రంగంలోకి దిగింది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల జిల్లాలో పలు స్థలాలు, అపార్టుమెంట్లు, భవనాలు వంటి స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో చలానాల బాగోతం, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ తాకట్టు పత్రాలతో రిజిస్ట్రేషన్లు, నిషేధిత భూములు, వివాదాల భూముల రిజిస్ట్రేషన్లు వెలుగు చూశాయి. ప్రతి దానిలోనూ కమీషన్లే. స్థిరాస్తి విలువ పెరగడంతో కమీషన్ల రేటు పెంచారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అమలులోకి వచ్చిన తర్వాత గాంధీనగర్‌లో లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి.
కానుమోలు కార్యాలయం పరిధిలో అక్కడి సబ్ రిజిస్ట్రార్ లేఅవుట్ లేని, నిషేధిత జాబితాలో ఉన్న వాటిని సైతం క్రయవిక్రయాలు జరిపి రిజిస్టర్ చేశారు. మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోట్లలో చలానాల అవినీతి జరిగింది. చలానాల కేసులో రాండమ్‌గా డాక్యుమెంట్లు తనిఖీ చేస్తేనే తక్కువ సొమ్ము చెల్లించినట్లు తేలింది.
అనిశా వలలో భూగర్భశాఖ అధికారి - బయటపడ్డ కోట్ల ఆస్తులు
పూర్తిస్థాయి దర్యాప్తును పక్కన పడేశారు. ఆ శాఖలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే.. అవినీతి రూపంలో పంపిణీ అయ్యే ఆదాయం ఎక్కువగా ఉంది. గత మే నెలలో పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావుపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించింది.
నాటి విచారణలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పలు విషయాలు తెలిశాయి. కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడిగా వసూలు చేసి ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తారనే విషయం వెలుగుచూసింది. గుణదల, నున్న, గాంధీనగర్, ఇబ్రహీంపట్నం, కంకిపాడు, గన్నవరం పేర్లు కూడా బయటికి వచ్చాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలో దాడులు జరగడం చర్చనీయాంశమైంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కమీషన్లు ముట్టచెబితే సరి.. ఎలాంటి వివాదాలున్నా ఆస్తులను రిజిస్టర్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏమాత్రం లిటిగేషన్ ఉన్నా అత్యధిక సొమ్ము డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు వివాదాలయ్యాయి. కరెన్సీనగర్, కానూరు ఆస్తిలోనూ ఇలాంటి తేడాలు రావడంతో వారు మరో ప్రాంతంలో రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిసింది.
Bangalore IT Raid Today : బిల్డర్ ఇంట్లో రూ.40 కోట్లు లభ్యం.. మరోసారి ఐటీ దాడుల కలకలం
ప్రతి కార్యాలయంలో కనీసం రెండు శాతం సొమ్ము సబ్‌రిజిస్ట్రార్ పేరుతో వసూలు చేస్తారు. దీనికి సూత్రధారులుగా డాక్యుమెంట్ రైటర్లు వ్యవహరిస్తున్నారు. వీరికి, సబ్ రిజిస్ట్రార్‌లకు మధ్య దళాలరీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎస్.ఆర్.లో మస్తాన్ అనే వ్యక్తి దళారీగా వ్యవహరించారు. ఆయన నివాసానికి అవినీతి నిరోధక శాఖ బృందం వెళ్లగా పరారైనట్లు సమాచారం.
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఉదారంగా వ్యవహరించే రిజిస్ట్రార్ల దగ్గరకు వెళ్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. చాలాచోట్ల కమిషన్ల తంతు బహిరంగంగానే జరుగుతోంది. దళారీలే కీలకంగా మారారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూలు చేసిన వాటిలో దామాషా ప్రకారం ఉన్నతాధికారులకు అందుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది.