తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఆనాటి ప్రళయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు.. ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. 1977 నవంబర్ 19న వచ్చిన ఉప్పెన ధాటికి పొంగిన అలలు సుమారు 83 గ్రామాలను జలసమాధి చేస్తూ.. విలయతాండవం సృష్టించింది. ఈ ఉప్పెన వల్ల కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, ఇరాలి, గొల్లపాలెం, బసవనిపాలెం తదితర మత్స్యకార ప్రాంతాల్లో సుమారు 10 వేలమంది ప్రాణాలు కోల్పోయారు.
1978లో సుమారు 30 షెల్టర్లు...
కృష్ణా జిల్లా దివిసీమలో నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో తుపాను, అలల తాకిడి నుంచి ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి 1978లో సుమారు 30వరకు తుపాను షెల్టర్లు నిర్మించారు. ప్రస్తుతం తుపాన్ షెల్టర్లు కొన్ని పాడవగా.. కొన్నింటిని అధికారులు కూల్చేశారు. ఇప్పటికీ సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలకు పక్కా గృహాలు లేవు. కేవలం తాటాకు గృహాలనే నివాసాలుగా వినియోగిస్తున్నారు. ఏ చిన్న పాటి గాలులు, వర్షం వచ్చినా.. రక్షణలేక దివి సీమ ప్రజలు భయపడిపోతున్నారు.
అప్పుడు చేశారు.. మళ్లా ఇప్పుడు చేయాలి..!
సముద్ర తీర ప్రాంతంలో ఈ కరకట్ట 2006, 2007 ఆ టైంలో మరమ్మతులు చేయడం జరిగింది. అవి ఇప్పుడు వర్షాలకు మొత్తం చొర్రలు పడిపోయి కనీసం వెహికల్స్ కాదు కదా... నడిసే మార్గం కూడా లేకుండాపోయింది. వాటికి మరమ్మతులు చేయాలి. ఈ సముద్ర తీరం అప్పుడే కరకట్ట పక్కన దరిదాపుగా 20 గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. ఈ 20 గ్రామాలు 22 కిలో మీటర్ల పొడవునా రహదారి అప్పుడు 2007లో మరి రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే ఇదంతా ఏశారు. మళ్లా అవన్నీ ఇప్పుడు పోయి ఈ నవంబర్ టైంలో మాకు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నందున ఆటన్నిటిని మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నాం. - శివాజీ, మాజీ సర్పంచ్, హంసలదీవి
దివిసీమ ముఖద్వారం వద్ద పైలాన్ నిర్మాణం..
నాటి ఉప్పెనలో చనిపోయిన వారిని స్మరిస్తూ... దివిసీమ ముఖద్వారం వద్ద నిర్మించిన పైలాన్ ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. సుమారు లక్షమంది నివసించే దివిసీమ చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టకు.. గోతులు పడి శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కనీస మరమతులు చేయడం లేదు.
తుపాన్లు, సునామీల నుంచి రక్షణ కల్పించండి..!
తుపాన్లు, సునామిల నుంచి రక్షణకు కరకట్టకు మరమ్మత్తులు చేసి, కూల్చి వేసిన తుపాన్ షెల్టర్లు స్థానంలో కొత్తవి నిర్మాణం చేయాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:
WEATHER UPDATE: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు