రాష్ట్రంలో సామాజిక న్యాయం సమర్థంగా అమలవుతోందని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల(MPTC, ZPTC ELECTION) ఫలితాలే దీనికి నిదర్శనమని ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ది చెందుతోందన్నారు. సంక్షేమ అభివృద్ది పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. ప్రతిపక్షం కొట్టుకుపోయిందనిపించేలా ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఎంతోమంది ప్రాణాలను రక్షించిన ఫలితమే ఇప్పుడు కనిపిస్తోందన్నారు.
వైకాపా మండిపాటు...
ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు బోగస్ అని ఆరోపణలు చేసిన తెదేపాపై వైకాపా మండిపడింది. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు బ్రహ్మరథం పడుతుంటే ఆరోపణలు చేయడం సరికాదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలిపిందని.. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించేసరికి ఎన్నికలు బహిష్కరించామని చెబుతూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా రాజీనామా చేసి రావాలని అప్పుడే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని సొంతూరులోనూ వైకాపా అభ్యర్థి గెలిచారని.. కుప్పంలో తెదేపా కుప్పకూలిపోయిందని ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని సూచించారు.
ఇదీ చదవండి: