కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించి.. కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని రెండు ప్రైవేట్ హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకున్నారు. అనుమతి లేకుండా కొవిడ్ సేవలందిస్తున్న అనిల్ న్యూరో ఆస్పత్రి వారికి రూ.2 లక్షల జరిమానా విధించారు.
కొవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రులు ప్రభుత్వ జీవో నెం.77 ప్రకారం రుసుము వసూలు చేయాలి. రోజుకు రూ.10 నుంచి రూ.15 వేలకు మించి ఛార్జ్ చేయకూడదు. జిల్లాలోని కొన్ని ఆస్పత్రుల్లో రోజువారి రుసుము లక్షల్లో ఉంటోంది. చికిత్స అందించేందుకు కొన్ని హాస్పిటల్స్‌కు కలెక్టర్ అనుమతులివ్వగా.. మరికొన్ని అనధికారికంగా చికిత్స ప్రారంభించాయి. ఎక్కడా.. ప్రభుత్వం సూచించిన రుసుముకు సేవలు అందించట్లేదని బాధితులు చెబుతున్నారు. వైద్యులు ధరించే పీపీఏ కిట్, ఆక్సిజన్, వెంటిలేటర్ ఇలా అన్నింటికీ భారీగా ధరలను నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఏదైనా సమస్య వస్తే 104, 1092 నెంబర్లకు ఫోన్ చేయాలని బాధితులకు జేసీ తెలిపారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం... పాజిటివ్ కేసులతో పాటు మరణాలూ అధికం