ETV Bharat / state

ఆస్ట్రేలియా ‘భారత రత్న’ అందుకున్నా: జగదీశ్‌ చెన్నుపాటి

Jagadeesh Chennupati: ఊళ్ళో కిరోసిన్‌ దీపం గుడ్డి వెలుతురులో చదువుకున్నవాడే.. బడి కోసం రోజూ ఆరు కిలోమీటర్లు నడిచినవాడే.. నేడు ‘నానో టెక్నాలజీ’ సాంకేతికతలో ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తల్లో ఒకడయ్యాడు. ఆస్ట్రేలియా అందించే అత్యున్నత పౌరపురస్కారం ‘కంపానియన్‌ ఆఫ్‌ ఆర్డర్‌’ని అందుకున్నాడు.. మనదేశంలోని ‘భారతరత్న’స్థాయి గౌరవం అది! ఒకప్పటి తనలా ఎవరూ ఇబ్బందిపడకూడదని.. పేద విద్యార్థులకి ప్రోత్సాహకాలెన్నో అందిస్తున్న జగదీశ్‌ చెన్నుపాటి ప్రస్థానం ఇది..

jagadeesh chennupati success story
ఆస్ట్రేలియా ‘భారత రత్న’ అందుకున్నా: జగదీశ్‌ చెన్నుపాటి
author img

By

Published : Jul 24, 2022, 12:36 PM IST

Jagadeesh Chennupati: పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న జగదీశ్‌ చెన్నుపాటి ప్రస్థానం..

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెం అన్న చిన్న గ్రామం మాది. పెదనాన్నా అత్తయ్యవాళ్లూ వాళ్ల పిల్లలతో కూడిన పెద్ద ఉమ్మడి కుటుంబం. మా నాన్న చెన్నుపాటి ధర్మారావు టీచర్‌. నేను మా ఊళ్ళోనే ఏడో తరగతిదాకా చదివాను. ఆ సమయంలోనే మా నాన్నమ్మ చనిపోయింది. ఆమె పోతూ.. అంతగా చదువుకోని మా పెదనాన్నా అత్తయ్యవాళ్ల కుటుంబాల్ని కూడా నాన్నే చూసుకోవాలని మాట తీసుకుందట.

టీచర్‌ ఉద్యోగంలో ఉంటే మూడు కుటుంబాల్ని పోషించడం కష్టమని నాన్న ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయడం ప్రారంభించారు.. అదీ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని ఆరెకాయలపాడు అన్న ఊళ్ళో. అప్పట్లో అక్కడ నాగార్జున సాగర్‌ కాలువ పనులు జరుగుతుండేవి. దాని దగ్గరగా ఉన్న ఊళ్ళో తక్కువ ధరకొచ్చే భూములు కొని పెద్దస్థాయిలో వ్యవసాయం చేయాలన్నది నాన్న ఆలోచన. అందుకే ఏడో తరగతి అయ్యాక నన్ను అక్కడికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికి ఆ ప్రాంతం అడవిలా ఉంది. బడులన్నవే లేవు.

దాంతో నా చదువు పాడు కాకూడదని నాన్న నన్ను మా ఊరికి దగ్గర్లోని తోట్లవల్లూరు జడ్పీ హైస్కూల్లో చేర్చాలనుకున్నారు. మా ఊరికీ తోట్లవల్లూరికీ మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. ఆ కాస్త దూరం కూడా నడవలేనంత అర్భకుడిగా ఉండేవాణ్ణి నేను అప్పట్లో. చీటికీమాటికీ జలుబూ జ్వరాలతో ఇబ్బందిపడుతుండేవాణ్ణి. అందువల్ల నాన్న నన్ను తోట్లవల్లూరులోనే ఎవరైనా బంధువుల ఇంట్లో ఉంచి చదివించాలనుకున్నారు.

jagadeesh chennupati success story
జగదీశ్‌ చెన్నుపాటి

ఎందుకోగానీ వాళ్లెవరూ ఒప్పుకోలేదు. దాంతో మానాన్న తన స్నేహితుడు, వల్లూరు జడ్పీ స్కూలులోని లెక్కల మాస్టారు చాగంటి సాంబిరెడ్డిని అడిగారు. ఆయన మారుమాట్లాడకుండా ఒప్పుకున్నారు. నాకయ్యే ఖర్చులు పంపిస్తాను అని నాన్న అన్నారట కానీ అది కుదర్లేదు. సాగర్‌ కాలువల పని ఆలస్యం కావడంతో... నీళ్లు లేక పంట చేతికి అందకపోవడంతో ఇల్లు గడవడమే గగనమై నాకు డబ్బు పంపించలేకపోయారు.

అయినా ఏ అసంతృప్తీ వ్యక్తంచేయకుండా నా బాధ్యత నిర్వహించింది సాంబిరెడ్డిగారి కుటుంబం. ఊళ్ళో ఉన్నంతవరకూ కిరోసిన్‌ దీపం వెలుతురులోనే చదువుకున్న నేను.. తొలిసారి కరెంటు వెలుగుకి అలవాటుపడింది వాళ్ళింట్లోనే. ఆ ఇంట్లోవాళ్ల చల్లటి పోషణతోనే నేను ఆరోగ్యవంతుణ్ణయ్యాను. ఎంత తండ్రిలా చూసుకున్నా- సాంబిరెడ్డిగారు ఓ లెక్కల మాస్టారిగా చాలా స్ట్రిక్టు.

ఉదయం నాలుగుగంటలకే నిద్రలేపి నిల్చోబెట్టి మరీ చదవమనేవారు. నిద్రతో జోగితే.. బెత్తంతో వాయించేవారు. అలా పదమూడేళ్లకే కఠోర శ్రమా, క్రమశిక్షణా నా జీవితంలో భాగమైపోయాయి. సాంబిరెడ్డిగారితోపాటూ నా వ్యక్తిత్వంపైన బలమైన ముద్రవేసిన వ్యక్తి.. వల్లూరు శ్రీనివాసరావు అనే మా ఇంగ్లిషు మాస్టారు. చిన్న జీతంతో పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నా ఎప్పుడూ ఎవరిదగ్గరా చేయిచాచని వ్యక్తిత్వం ఆయనది. ఆయన్నుంచి అలవర్చుకున్న నీతీ నిజాయతీలే నన్నో మంచి అడ్మినిస్ట్రేటర్‌గానూ నిలిపాయి.

నా ఎదుగుదలలో అమ్మానాన్నల పాత్ర ఎంతో వీళ్ల పాత్రా అంతే! ఆ ఇద్దరి చలవతోనే పదోతరగతిలో మంచి మార్కులతో పాసయ్యాను. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని జేకేసీ కాలేజీలో చేరాను.

ఫెయిల్యూర్స్‌ 1, 2.. అప్పటిదాకా కఠిన క్రమశిక్షణ మధ్య ఉన్నానేమో.. గుంటూరుకొచ్చాక తొలిసారి అందివచ్చిన స్వేచ్ఛతో పక్కదోవ పట్టాను. స్నేహితులతో బలాదూర్లు పెరిగాయి. ఫలితం- ఇంటర్‌లో 63 శాతం మార్కులే వచ్చాయి. నాన్నకీ, మాస్టారుకీ అదో పెద్ద షాక్‌! ‘నువ్వు ఇంజినీరింగ్‌ చేయాలని కలలు కన్నాంరా..!’ అంటూవాళ్లు బాధని వెళ్ళగక్కాకగానీ.. నాలో పశ్చాత్తాపం కలగలేదు. అంతతక్కువ మార్కులతో ఇంజినీరింగ్‌లో ఎలాగూ చేరలేను.. ఇకపైనైనా బాగా చదువుదామని తెనాలి వీఆర్‌ఎస్‌ కాలేజీలో బీఎస్సీలో చేరాను. అప్పటిదాకా తెలుగు మీడియం చదివి తొలిసారి ఇంగ్లిషు మీడియంలోకి వెళ్లడంతో కొంత ఇబ్బందిపడ్డాను కానీ.. చివరికి మంచి మార్కులే సాధించాను. ఆ తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అప్లయిడ్‌ ఫిజిక్స్‌లో చేరాను.

నా పదకొండో ఏట నుంచి నేను మాస్టారి ఇంట్లోనే చదవడం వల్ల నాకెప్పుడూ కుల పట్టింపులన్నవి ఉండేవి కావు. కానీ..నాటి వర్సిటీ వాతావరణం అలా లేదు. కులాల పేరుతో విడిపోయి గొడవలు పడుతుండేవారు. ఆ పరిస్థితిని మార్చాలని విద్యార్థి రాజకీయాల్లోకి వెళ్లాను. రెండేళ్లు అదే ప్రపంచంగా తిరిగాను. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాకకానీ నాకు తత్వం బోధపడలేదు. ఆ తర్వాత నేను చదవడానికి మిగిలింది ఒక్క ఏడాదే! నేనేమిటో నిరూపించుకోవాలని రోజూ 14 గంటలు లైబ్రరీలోనూ.. ల్యాబుల్లోనూ ఉండి చదవడం మొదలుపెట్టాను. ఫస్ట్‌క్లాస్‌లో పాసై బయటకొచ్చాను.

ఉద్యోగం రాలేదు.. ఎమ్మెస్సీ తర్వాత పరిశోధనవైపు వెళ్లాలంటే- నేను చదివింది ప్యూర్‌ ఫిజిక్స్‌ కాకపోవడం వల్ల అవకాశం ఇవ్వలేదు. పోనీ, టెక్నాలజీ రంగంలో ఉద్యోగానికి వెళ్లాలంటే- నాది ఇంజినీరింగ్‌ డిగ్రీ కాదని నిరాకరించారు. ఐఐటీ-దిల్లీలో దరఖాస్తు చేసుకుందామని వెళితే.. అక్కడా మొండిచేయే ఎదురైంది. చివరికి దిల్లీ వర్సిటీలో రీసెర్చి ఫెలోగా అవకాశం దక్కింది. దాంతో ‘మనమూ ఇక సంపాదనపరులమైపోయాం!’ అనుకుని అప్పటిదాకా కొద్దోగొప్పో డబ్బుపంపిస్తున్న సాంబిరెడ్డి మాస్టారికి ఇక డబ్బక్కర్లేదంటూ లేఖ రాశాను. ఆపై వారానికే.. వర్సిటీ జూనియర్‌ఫెలోకి స్కాలర్షిప్‌ ఇవ్వకూడదంటూ నిర్ణయం తీసుకోవడంతో నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.

దిల్లీ దాబాల్లో రూపాయికి నాలుగు చపాతీలు కూరలేకుండా ఇస్తుండేవాళ్లు. కూరకావాలంటే అదనంగా ఐదురూపాయలు ఇవ్వాలి. నేను ఓ రూపాయికి చపాతీలు తీసుకుని వాటినే రెండుపూటలకూ సర్దుకునేవాణ్ణి. దాదాపు ఆరునెలలు అలాగే గడిచాయి. ఈలోపు సీఎస్‌ఐఆర్‌ స్కాలర్షిప్‌ సాధించుకోగలగడంతో పరిస్థితి కుదుటపడింది. దిల్లీ వర్సిటీలో నాలుగేళ్లలోనే ఎంఫిల్‌ పీహెచ్‌డీలు ముగించాను. తితిదేవాళ్ల శ్రీ వెంకటేశ్వర కాలేజీలో లెక్చరర్‌గా వెళ్లాను. అప్పుడే విదేశాల్లో జరిగే పరిశోధనలవైపు నా దృష్టిపడింది. నేను పనిచేస్తున్న కాలేజీ లైబ్రరీకి అప్పట్లో ‘ఫిజిక్స్‌ టుడే’ అన్న పత్రిక వస్తుండేది.

అందులో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ అవకాశం కోసం విదేశీ వర్సిటీల యాడ్స్‌ చూసి దరఖాస్తు చేస్తుండేవాణ్ణి. అవేవీ రాలేదు.. చెప్పాలంటే 300 తిరస్కరణ ఉత్తరాలు అందుకున్నాన్నేను. చివరికి- కెనడా క్వీన్స్‌ వర్సిటీలోని డేవిడ్‌ ఆథర్టన్‌ అన్న ప్రొఫెసర్‌ ఆహ్వానించారు.

అదేమిటంటే.. నన్ను రమ్మన్న కెనడా వర్సిటీ ప్రొఫెసర్‌ అయస్కాంతశక్తితో ఆయిల్‌ పైపులు తుప్పుపట్టకుండా నివారించే మెషీన్‌లని తయారుచేస్తున్నారు. అప్పటిదాకా నేను చేసిన ‘సెమికండక్టర్‌ ఫిల్మ్‌’ పరిశోధనకీ దానికీ ఏ సంబంధమూ లేదు. అయినాసరే.. వెళ్లాను. నాకు సంబంధంలేని అంశం కావడంతో రోజూ 15 గంటలు శ్రమించి అందులో పట్టుసాధించాను. నేనూ సొంతంగా పరికరాలని రూపొందించి.. పది పరిశోధనా పత్రాలు రాశాను. దాంతో మరో ఏడాది నా ఫెలోషిప్‌ని పొడిగించారు. ఈలోపు మా అమ్మానాన్నలు నాకోసం అమ్మాయిని చూడటం మొదలుపెట్టారని తెలిసి నా గుండెల్లో రాయిపడింది.

అప్పటికే నేను నాతోపాటూ దిల్లీ వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న కన్నడిగుల అమ్మాయి విద్యాశంకర్‌ ప్రేమలో తలమునకలై ఉన్నాను. ఆ విషయం చెబుతూ నాన్నకి లేఖ రాస్తే వాళ్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వేరేదారిలేక సాంబిరెడ్డి మాస్టారి సాయం కోరుతూ లేఖ రాశాను. ఆయనే ఇరుకుటుంబాలనీ ఒప్పించారు. అలా తిరుపతిలో పెళ్ళి చేసుకున్న నేనూ విద్యా కెనడాలోనే కాపురం పెట్టాం. రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నేషనల్‌ వర్సిటీలో కొత్తగా ఎలక్ట్రానిక్స్‌ శాఖని ఏర్పాటుచేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లాము. ఆస్ట్రేలియాలో యువపరిశోధకుణ్ణయినా సరే.. ప్రత్యేక లేజర్‌ మెషీన్‌లూ, అతిచిన్న ఎల్‌ఈడీలని రూపొందించే పరికరాన్ని(ఎమ్‌ఓసీడీ అంటారు) ఏర్పాటుచేశాను.

నా ఫెలోషిప్‌ పూర్తయిన మూడేళ్లకి భారత్‌కి తిరిగిరావాలనుకున్నాను కానీ.. వాళ్లే వీసా ఇచ్చి ఉండిపొమ్మన్నారు. ఐదారేళ్ల తర్వాత ఆ డిపార్ట్‌మెంట్‌ అధ్యక్షుడి పోస్టు ఖాళీ అయింది. ప్రపంచవ్యాప్తంగా 130 మంది పేరున్న శాస్త్రవేత్తలతోపాటూ నేనూ దానికి దరఖాస్తు చేసుకున్నాను. ఎన్నో వడపోతల తర్వాత చివరిగా నా పేరూ, ఇంకొకరి పేరూ మిగిలింది. ఆ మరో శాస్త్రవేత్త ఆస్ట్రేలియా దేశస్థుడైనా విదేశాల్లో స్థిరపడ్డవాడు.

ప్రసిద్ధ వర్సిటీల్లో చదివి కొలంబియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నాడాయన. ఆయన స్థాయికి ఏమాత్రం సరితూగని పట్టాలు నావి. నాకున్న అర్హతలల్లా ప్రాక్టికల్‌ నాలెడ్జే... అతితక్కువ సమయంలో కీలకమైన పరికరాలని ఆవిష్కరించగలగడమే. చివరికి వర్సిటీ పాలకులు నా వైపే మొగ్గారు! వాళ్లు నాపైన ఉంచిన నమ్మకానికి తగ్గట్టే పాతికేళ్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎలక్ట్రానిక్స్‌ డిపార్టుమెంటుల్లో ఒకటిగా మా శాఖని తీర్చిదిద్దాను.

హైడ్రోజన్‌ నుంచి హాలోగ్రామ్‌ దాకా!.. ప్రపంచమంతా ఇప్పుడు కాలుష్యరహిత హైడ్రోజన్‌ శక్తినే ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇందుకోసం నీటి అణువుల నుంచి హైడ్రోజన్‌ అణువుల్ని అతిసులభంగా వేరు చేసే నానో ప్రక్రియని నేను కనిపెట్టాను. అదే కాదు, అత్యాధునిక మొబైల్‌ ఫోన్‌లలో ఉపయోగించే ఫోల్డబుల్‌ ఎల్‌ఈడీ లైట్లూ, గ్రాములో వెయ్యోవంతుమాత్రమే బరువుండే సోలార్‌ సెల్‌లూ, మనిషి కేవలం నీడలాకాకుండా ఓ 3డీ బొమ్మలా కనిపించే హోలోగ్రామ్‌లూ.. ఇవన్నీ నా ‘నానో’ పరిశోధనలతో బయటకొచ్చినవే. వీటికోసం ఏడు అమెరికన్‌ పేటెంట్లు సాధించాను. వాటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మా ఆస్ట్రేలియా నేషనల్‌ వర్సిటీ పేరుప్రతిష్ఠలు పెరగడంతో- ఆ దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం ‘కంపానియన్‌ ఆఫ్‌ ఆర్డర్‌’ని (మన భారతరత్న లాంటిది) అందించారు. ఒక్క భారతీయులనే కాదు ఆసియాకి చెందిన ఇంకెవరికీ దక్కని అరుదైన గౌరవం అది! భౌతికశాస్త్రంలో ప్రపంచస్థాయి పరిశోధనలు చేసే అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌- ఆస్ట్రేలియాకి ఇటీవలే అధ్యక్షుడిగా ఎంపికయ్యాను. వీటితోపాటూ జపాన్‌ నుంచి ఇటు అమెరికాదాకా ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలన్నింటికీ డిస్టింగ్విష్డ్‌ ప్రొఫెసర్‌గా వెళుతున్నాను. అందులో భాగంగా ఐఐటీ-దిల్లీ, ఐఐటీ-హైదరాబాద్‌లకీ వస్తుంటాను!

నా భార్యతో కలిసి.. చిన్నప్పుడు కిరోసిన్‌ దీపంతో చదువుకున్నానని చెప్పాను కదా.. ఆఫ్రికా దేశాల్లో కొన్ని గ్రామాలు ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ల కోసం నేనూ నా భార్య విద్యా కలిసి ఏడాదికి రెండువేల సోలార్‌ ల్యాంపుల్ని ఓ ఎన్జీఓ ద్వారా అందిస్తున్నాం. పాలినేట్‌ గ్రూప్‌ అన్న మరో సంస్థ ద్వారా మనదేశంలోని మహిళా వ్యాపారవేత్తలకి సాయపడుతున్నాం.

jagadeesh chennupati success story
భార్యతో జగదీశ్‌ చెన్నుపాటి

విద్య బయోటెక్నాలజీ పరిశోధకురాలు. ఈ మధ్యే ఇద్దరం కలిసి ‘జగదీష్‌-విద్యా చెన్నుపాటి ఎండోమెంట్‌ నిధి’ని ఏర్పాటుచేశాము. దాని ద్వారా మన భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాకి వచ్చి పరిశోధనలు చేసేందుకు సాయపడుతున్నాం. ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది విద్యార్థులతో సహా పరిశోధనా విద్యార్థులు ఎవరైనా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవాళ్లకి ఆస్ట్రేలియాలో అయ్యే ఖర్చులన్నింటినీ మేమే చూసుకుంటాం!

ఇవీ చూడండి: Command control center: హైదరబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.