ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల కొనసాగుతోంది. భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని లంకగ్రామాల వాసుల్లో ఆందోళన పెరుగుతోంది. లోతట్టునున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆయా గ్రామాల వాసులను అప్రమత్తం చేశారు.
కొల్లూరు, దోనేపూడి ఉన్నత పాఠశాలల్లో వరద బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ మందిని ఈ కేంద్రాల్లో ఉంచేలా వసతులు కల్పిస్తున్నారు. భట్టిప్రోలులోని విశ్వశాంతి పాఠశాలలో పునరావాస కేంద్రానికి.. పడవల ద్వారా బాధితులను తరలిస్తున్నారు. కొల్లూరు-పెసర్లంక రహదారి కోతకు గురైంది.
కరకట్ట భద్రతపై ఆందోళన
కృష్ణానదికి వరదలు వస్తున్నాయంటే 2009, అక్టోబరు 6న ఓలేరు పల్లెపాలెం వద్ద కరకట్టకి గండిపడిన సంఘటనే ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తుంది. అప్పట్లో గండి ప్రభావంతో రూ.కోట్లలో నష్టం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు విడుదలయ్యే అవకాశం ఉంది. కరకట్ట విస్తీర్ణ పనులు జరగటంతో పలు చోట్ల కట్టకు కొత్త మట్టి వేశారు. ఇటీవల ఓలేరు వద్ద గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలను వేసి బలపరిచారు. వరద ఉద్ధృతి పెరిగితే ఏమేరకు ఇసుక బస్తాలు నిలుస్తాయోనని ఆ ప్రాంతవాసులు భయపడుతున్నారు. ఇప్పటికే పెదపులివర్రు, వెల్లటూరు, దోనేపూడి ప్రాంతాల్లో కరకట్ట బలహీనంగానే ఉంది. అధికారులు దాన్ని బలపరిచేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
వరద పరిస్థితులను ఎదుర్కోవడంలో నిర్లిప్తత ఎందుకు?: లోకేశ్
వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తీర ప్రాంత ప్రజానీకం, రైతులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగా ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని కృష్ణానది ముంపు ప్రాంతాల్లో పలువురు నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధాని మోదీ ఫోన్‌చేసి మాట్లాడాకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు జరిపారని, అంతకు ముందు నిర్లిప్తంగా ఉన్నారని దుయ్యబట్టారు. గతంలో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని, రైతు భరోసా అమలుపై రైతుల్లో అసంతృప్తి ఉందన్నారు. స్మార్ట్‌ఫోన్ పట్టుకున్నా, టీషర్టు వేసుకున్నా రైతు కాదంటున్నారని వ్యాఖ్యానించారు. నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్‌లు మాట్లాడుతూ అమరావతికి చెడ్డ పేరు తెచ్చేందుకు, ముంపు ప్రాంతంగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు తాపత్రయపడుతున్నారని చెప్పారు.
విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలంటూ రాస్తారోకో
పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల్లో రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా లేదని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌చేస్తూ ఆయా గ్రామాల వాసులు స్థానిక విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద రహదారిపై శుక్రవారం రాత్రి రాస్తారోకో చేశారు. పర్యటనకు వచ్చిన కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పినా.. ఫలితం లేకపోవడంతో వారు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. వరదనీరు రావడంతో విషసర్పాలు పెద్దఎత్తున సంచరిస్తున్నాయని, విద్యుత్తు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఇచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. స్పందించిన విద్యుత్తు శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో పడవలు తిరుగుతున్నాయని, ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేశామని వివరించారు. పడవలు తిరగకుండా ఉంటే వెంటనే సరఫరా ఇస్తామని చెప్పారు.
ప్రత్యేక అధికారుల నియామకం
ముంపు ప్రాంతాల్లో సేవలందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. జిల్లా పరిషత్ సీఈవో డి.చైతన్య, చుండూరు తహసీల్దారు విజయజ్యోతికుమారిలను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. తూములూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హనుమాన్‌పాలెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ప్రకటించారు. మండల పరిధిలోని ముంపు గ్రామాలైన అన్నవరపులంక, కొత్తూరులంక, మునగపల్లిలంక, బొమ్మువానిపాలెం ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని అధికారులు కోరుతున్నారు. ముంపు ప్రాంత ప్రజలకు ఆహారం, తాగునీరు, మౌలిక వసతుల కల్పన దిశగా చర్యలు చేపట్టారు. బాధితులను తరలించేందుకు నాలుగు మరబోట్లను సిద్ధం చేశారు. ముంపుప్రాంతాలు, లంక గ్రామాల్లో ప్రత్యేక అధికారి డి.చైతన్య పర్యటించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దారు జి.నాంచారయ్య, ఎంపీడీవో పి.శ్రీనివాసులు ఉన్నారు.
ఇవీ చదవండి..