ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సర్పంచి పదవికి నామినేషన్ వేసి తిరస్కరణకు గురైన ముండ్లపాటి రత్నకుమారి డిమాండ్ చేశారు. శనివారం ఆమె పెనుగంచిప్రోలులో విలేకరులతో మాట్లాడారు. తనకు తహసీల్దారు షాకిరున్నీసాబేగం రెండు సార్లు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారని, ఆ పత్రాలతోనే తాను తొలి విడత జరిగిన పంచాయతీ సర్పంచి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు.
తన కులంపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారించిన రెవెన్యూ అధికారులు... అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లోనై తాను ఎస్సీ కాదు.. బీసీ-సీ అని ధ్రువీకరిస్తూ ఎన్నికల అధికారికి లేఖ రాశారని తెలిపారు. ఫలితంగా తన నామినేషన్ తిరస్కరణకు గురైందని చెప్పారు. మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. సదరు అధికారులైన తహసీల్దారు, ఆర్‌ఐ, వీఆర్వోలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వివరించారు.
ఇదీ చదవండి: