రాష్ట్రంలోని వివిధ దేవాలయాల ధర్మకర్తల మండళ్లను రద్దు చేసి బాధ్యతలను ఈవోలకు అప్పగించడం సరికాదని ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. శ్రీశైలం భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి దేవస్థానం,నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం తదితర ఆలయాలకు.. గతంలో ఉన్న ధర్మకర్తల మండళ్లను కొనసాగనివ్వాలని ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, సంబంధిత ఆలయాల ఈవోలకు నోటీసులు ఇచ్చింది.
ఫిబ్రవరి 13కు విచారణ వాయిదా
దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం దేవాదాయ చట్టానికి సవరణ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న మండళ్లను రద్దు చేస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. తమ రెండేళ్ల కాలపరిమితి ముగియకముందే పాలకమండళ్లను రద్దు చేశారని వివిధ ఆలయాల ధర్మకర్తల మండలి సభ్యులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం...గత ట్రస్ట్ బోర్డులు కొనసాగేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ధర్మకర్తల మండళ్ల ఎంపిక ప్రక్రియను కొనసాగించుకోవచ్చన్న హైకోర్టు......తమ అనుమతి లేకుండా ఖరారు చేయవద్దని స్పష్టం చేసింది. విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : 'రైల్వే అప్రెంటిస్ పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయాలి'