Chandrababu comments on YSRCP: రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం వాటిల్లిందని, రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయజెండాను ఆయన ఆవిష్కరించారు. విజన్ 2047తో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు.
రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. 'విజన్-2047'తో ప్రణాళికాబద్దంగా ప్రయాణం సాగించాలన్నారు. పేదరికం, అసమానతలు లేని సమాజం సాధించడం లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలన్నారు.
నైపుణ్యం గల పౌరులు, డిజిటల్ స్ట్రెంథ్, ప్రపంచంలో ఎవరికీ లేని యువశక్తి భారత దేశానికి ఉన్న బలమని చంద్రబాబు పేర్కొన్నారు. యువశక్తిని సమగ్రంగా వినియోగించుకోవడం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ మేటి దేశంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడే 'విజన్-2047' సిద్ధం చేసుకుని... ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం ద్వారా.. భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుందన్నారు. ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకోవడం ద్వారా తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారన్నారు.
2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా పనిచేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ద, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని చంద్రబాబు అన్నారు.
ఇవీ చదవండి :