కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆముదార్లంక గ్రామానికి.. కృష్ణా నది అవతల వైపు మూడు వైపులా గుంటూరు జిల్లాకు సంబందించిన గ్రామాల సరిహద్దులు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలకు సంబంధించి ధృవపత్రం కావాలంటే చల్లపల్లికి రావలసిందే. అముదార్లంక నుండి చల్లపల్లికి సుమారు 28 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గ్రామానికి రెవిన్యూ, ఇతర శాఖల అధికారులు రావాలన్నా వారికి అవే ఇబ్బందులు. ఈ గ్రామంలో ప్రజలు గుంటూరు జిల్లాలో వేరొక గ్రామాన్ని కలపడానికి ఇష్టపడరు. వీరికి కృష్ణానది మధ్యలో ఉన్న లచ్చిగాని లంకలో రెండు వేల ఎకరాల్లో ఉన్న సారవంతమైన పంటలు పండే భూములు ఉండటం ఒక కారణంగా చెబుతారు.
కృష్ణా నదికి వరద ముప్పు తప్పినప్పటికీ కృష్ణానది ప్రక్కనే ఉన్న యస్సీ కాలనీలో 24 నివాస గృహాలు, బీసీ కాలనీలో 35 నివాస గృహాలు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 200 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. గత సంవత్సరం వరదకు మునిగిపోయిన పంట పొలాలకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని.. మరలా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన పసుపు, కంద పంటలు వేస్తే.. చేతికొచ్చేసరికి వరద నీటిలో మునిగిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. చిన్న పిల్లలకు కనీసం తినడానికి ఆహారం ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు.
అప్పులు తెచ్చి సాగుచేసుకున్న పంటలు వరద నీటిలో మునిగిపోయి ఒక వైపు బాధపడుతుంటే.. నివాస గృహాలు మునిగిపోయి నిలువ నీడ లేకుండా ఉన్న తమకు పునరావాస కేంద్రాలకు వస్తేనే ఆహారం అందిస్తాము అని రెవిన్యూ అధికారులు తెలిపారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆహారం, మంచినీళ్లు సైతం ఇవ్వలేదని వాపోయారు. కనీసం ఆహారం అన్నా అందించాలని ఆముదార్లంక వరద బాధితులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: