Andhra Pradesh received huge financial assistance from the Centre : అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం 2014-15 ఆర్థిక సంవత్సరం రెవెన్యూలోటు కింద రూ.10,461 కోట్లు మంజూరు చేసింది. ఇవే నిధుల కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినా, నేరుగా ప్రధానిని కలిని విన్నవించినా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు అడిగి మరీ మంజూరు చేయడం గమనార్హం. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడం విశేషం.
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నాం.. కేంద్రంతో సత్సంబంధాల ద్వారా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూలోటు గ్రాంటు 10,460.87 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంటు ఉపయోగించి చేపట్టే ప్రాజెక్టులకు అన్ని చట్టబద్ధమైన అనుమతులు ఉండాలని కేంద్రం పేర్కొందన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతి, ప్రాజెక్ట్ పూర్తి కోసం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఖర్చుల విషయంలో సాధారణ, ఆర్థిక నియమాలు పాటించాలని, ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సహాయ ఉత్తర్వులో సాధారణంగా ఇవి పొందుపరిచే అంశాలేనని బుగ్గన తెలిపారు. తద్వారా నిధులు రెండోసారి కేటాయింపు జరగకుండా జాగ్రత్త పడడం దీని ఉద్దేశమని అన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని అంశాలతో పాటు 2014-15 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీని కూడా సాధించలేకపోయిందని మంత్రి విమర్శించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రెవెన్యూ లోటును సాధించలేక చేతులెత్తేసిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రావలసిన ఆర్డీజీ నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పలు మార్లు ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, నీతి ఆయోగ్ సభ్యులు, దక్షిణ జోనల్ కౌన్సిల్ మీటింగ్స్ లో వివరిస్తూ వచ్చామని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్డీజీ విడుదల కోసం కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా సమాచారాన్ని సమర్పించి చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ కోసం ఒత్తిడి తెస్తూనే ఉందని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు వివరించి విన్నవించకోవడం కోసం అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించి చర్చించామన్నారు. ముఖ్యమంత్రి జగన్ గత ఢిల్లీ పర్యటనలో జరిగిన చర్చలు, కొలిక్కి వచ్చి నిధుల విడుదలకు ఆర్థిక శాఖను కేంద్రం ఆదేశించిందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి :