తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కారణంగా కృష్ణా రీజియన్‌లో మిగిలిపోయిన ఆర్టీసీ బస్సులను అధికారులు సర్దుబాటు చేశారు. వీటిని రాష్ట్రంలోని వివిధ మార్గాల్లో అదనంగా తిప్పేందుకు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతులు వచ్చాయి. కృష్ణా జిల్లా నుంచి గతంలో తెలంగాణకు మొత్తం 264 సర్వీసులు తిరిగేవి. ఒప్పందంతో 98 బస్సులు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోనే ఎక్కువ సర్వీసులు ఈ రీజియన్‌లోనే ఆగిపోయాయి. జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనలను ఎండీ కార్యాలయంలో పరిశీలించి... ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేశారు. మిగిలిన వాటిల్లో 28 బస్సులను రాయలసీమ రీజియన్లకు కేటాయించారు. ఇందులో కర్నూలు రీజియన్‌కు 25, కడప రీజియన్‌కు 3 చొప్పున బదిలీ కానున్నాయి. ఫలితంగా కృష్ణా రీజియన్ బస్సుల సంఖ్య తగ్గనుంది. మిగిలిన 70 బస్సులను కొత్త మార్గాలను కేటాయించడంతో పాటు జిల్లాలో అంతర్గతంగా సర్దుబాటు చేశారు. విజయవాడ నుంచి కర్నూలుకు నాలుగు, కాకినాడకు 1, శ్రీశైలం.. 2, కడప.. 2, పామూరు.. 2, విశాఖపట్నం.. 4, కదిరి.. 2, హిందూపురం.. 2, తిరుపతి.. 4, బెంగళూరు.. 4, అనంతపురం.. 4, శ్రీకాకుళం.. 2, విజయనగరం.. 2, ఎర్రగొండపాలెం.. 1, తిరువూరు నుంచి విశాఖపట్నం.. 2, గుడివాడ - విశాఖపట్నం.. 2 చొప్పున అదనంగా తిప్పనున్నారు. మిగిలిన బస్సులను జిల్లాలోని పలు రూట్లలో అంతర్గతంగా సర్దుబాటు చేశారు. కొన్ని మార్గాల్లో సర్వీసులను ఉన్నతీకరించారు.
ఇదీ చదవండి: