Dumb woman Kidnap: ఓ బధిర మహిళను బంధించి అత్యాచారం చేశారనే ఫిర్యాదుపై.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పోలీసులు.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో విచారణ జరుపుతున్నారు. సాంకేతిక ఆధారాలతో ఆదివారం పలుచోట్ల కూపీ లాగినట్లు సమాచారం. మచిలీపట్నానికి చెందిన వంట కార్మికురాలు (37) ఫిబ్రవరి 4న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆ మూగ మహిళ కుటుంబసభ్యులు మరునాడు స్థానిక ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. మార్చి 9న బాధితురాలి కుటుంబీకులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానని, ఓ మహిళ ఇక్కడ ఉందని తెలిపాడు. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కరీంనగర్‌కు వచ్చి బాధితురాలిని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాటలు రాకపోవడంతో ఏం జరిగిందన్నది ఆమె చెప్పలేకపోయింది.
రెండోసారి ఫిర్యాదుతో విచారణ
బాధిత మహిళ ఇంటికి చేరిన రెండు మూడు రోజుల తర్వాత సైగల ద్వారా తనను కిడ్నాప్ చేసి ఓ గదిలో కొన్నాళ్లు బంధించి అత్యాచారం చేశారని సోదరుడికి చెప్పడంతో అతను మళ్లీ బందరులోని ఆర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలతో సీఐ కొండయ్య నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితురాలిని వెంటబెట్టుకొని తాజాగా కరీంనగర్‌కు వచ్చింది. ఆమెను ఏ ప్రాంతంలో ఉంచారు? ఏం జరిగిందన్నది స్థానిక పోలీసుల సహకారంతో గోప్యంగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి సోదరుడికి గతంలో ఫోన్ చేసిన నంబర్ కీలకంగా మారింది. ఇంత దూరం ఎవరు తీసుకువచ్చారు? ఎవరి చెరలో ఉంచారు? అన్నది కూపీ లాగుతున్నారు.
ఇదీ చదవండి:
అమానుషం: స్కూటీపై పుల్లతో గీశాడని ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు!