కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ మండలం, పాత ఎడ్లలంక కాజ్వే పై నాలుగు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. అవనిగడ్డ - పాత ఎడ్లలంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరిగితే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తహశీల్దార్ తెలిపారు. ఎడ్లలంకలో వరదలో చిక్కుకున్న 20 గొర్రెలు, ఇద్దరు కాపర్లను అధికారులు రక్షించారు.
నీట మునిగిన 30 ఇళ్లు
చల్లపల్లి మండలంలోని ఆముదాల లంకలో 30 ఇళ్లు నీట మునిగాయి. వీరికి స్థానిక చర్చిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. నిమ్మగడ్డ, నడకుదురు వద్ద పొలాల్లోకి వరద నీరు చేరింది. పసుపు, అరటి పంటలు నీట మునిగాయి. నాగాయలంక మండలం నాచుగుంటలో 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ పాద క్షేత్రం ఘాట్ వద్ద కృష్ణమ్మ పాదాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మత్స్యకారులు తమ పడవలకు లంగరు వేసుకుని కాపాడుకున్నారు.
వరద బాధితులను కాపాడిన పోలీసులు
మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ, కొత్తపాలెం దగ్గర లచ్చిగానిలంక దగ్గర వరదలో చిక్కుకుపోయిన 20 మంది రైతులను పోలీసులు, విపత్తు నిర్వహక బృందం కాపాడింది. లంకలో ఉన్న 200 గొర్రెలు, గేదెలు, ఆవులను అధికారులు రక్షించారు. కొక్కిలిగడ్డ హరిజనవాడలోకి వరదనీరు ప్రవేశించింది. ఘంటసాల మండలం పాప వినాశనం వద్ద కృష్ణా నది మధ్యలో ఉన్న లంకలో చిక్కుకున్న ఆరుగురు రైతులను పోలీసులు కాపాడారు. పట్టుపురుగులు, మల్బరీ తోటలు నీటమునిగిపోవటంపై రైతులు ఆవేదన చెందుతున్నారు.
కోడూరు మండలం పిట్టలంక, విశ్వనాథపల్లి దగ్గర కృష్ణా నది కి ఏర్పాటు చేసిన కరకట్ట బలహీనంగా ఉండటంతో 200 ఇసుక బస్తాలను అధికారులు సిద్దంగా ఉంచారు. కృష్ణా నది మధ్యలో ఉన్న లంకలో చిక్కుకున్న రైతులను అవనిగడ్డ, చల్లపల్లి పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలత అవనిగడ్డ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
ఇది కూడా చదవండి