రోజు రోజుకూ కరోనా బాధితులు పెరుగుతుండటంతో వారందరూ త్వరగా కోలుకోవాలనే సదుద్దేశ్యంతోనే ప్రభుత్వ అనుమతి తీసుకునే విజయవాడ స్వర్ణప్యాలెస్ హోటల్‌ను కొవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చినట్లు రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని తమ ఆసుపత్రిని పూర్తిగా కరోనా బాధితులకు కేటాయించామన్నారు. అయితే అందులో కేవలం 30 పడకలు మాత్రమే ఉండడంతో... చాలా మంది కరోనా వైరస్ సోకిన వారి నుంచి ఆసుపత్రిలో వైద్యం అందించాలని ఒత్తిడి.... అభ్యర్ధనలు రావడం వల్ల... ప్రభుత్వ అనుమతితోనే అన్ని సౌకర్యాలున్న స్వర్ణప్యాలెస్ హోటల్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతనే రమేష్ ఆసుపత్రి నిర్వహించిందని తెలిపింది. చికిత్సా కేంద్రం నిర్వహణ, అద్దె వసూలు, ఇతర అంశాల బాధ్యతంతా హోటల్ నిర్వాహకులదేని.. ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ కేంద్రంలో చేరిన కరోనా రోగులకు వైద్య సేవలు అందించడం వరకే తమకు సంబంధమని వెల్లడించింది. అగ్ని ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఇంతవరకు తమ చికిత్సా కేంద్రాల ద్వారా 500 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. స్వర్ణప్యాలెస్ చికిత్స కేంద్రంలోని వారంతా చక్కగా కోలుకుంటున్న సమయంలో అగ్నిప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పొవడం దురదృష్టకరమంటూ.. బాధిత కుటుంబాలకు రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
ఇవీ చూడండి: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ప్రొ.శివశంకర్ నియామకం