Avanigadda Damaged Roads Protest: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ రోడ్డుని చూసినా గజానికో గుంత దర్శనమిస్తోంది. గడప దాటి రోడ్డెక్కితే చాలు అది ఏ దారైనా అంతా గతుకులమయం. ఈ పరిస్థితుల్లో ప్రయాణమంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'మా రహదారులకు దిక్కెవరు' అంటూ ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేప్టటారు.
అవనిగడ్డ నియోజకవర్గంలోని రహదారులు.. వాహనదారులతో పాటు, స్థానిక ప్రజలకు నరకం చూపుతున్నాయి. కొడాలి నుంచి రామనగరం వరకు 15కిలోమీటర్ల మేర రోడ్డు అస్తవ్యస్థంగా తయారైంది. ఈ రహదారికి అనుసంధానంగా 10కి పైగా గ్రామాలు ఉన్నాయి. దీంతో నిత్యం గ్రామీణ ప్రాంతాల నుంచి అవనిగడ్డకు రాకపోకలు సాగించే విద్యార్థులు, ప్రయాణికులు మూడేళ్లుగా నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లపై భారీ స్థాయిలో గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఎన్నిసార్లు అధికారులను కోరినా.. నిధులు కొరత ఉందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా.. 'మా రహదారులకు దిక్కెవరు' అంటూ బ్యానర్ పట్టుకుని ఘంటసాల మండల ప్రజలు నిరసన తెలిపారు.
వర్షానికి గోతుల్లోకి నీరు చేరడంతో రోడ్డును అంచనా వేయలేక.. ద్విచక్రవావానదారులు గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని, కనీసం వీధి దీపాలు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. దారుణంగా మారిన రోడ్లతో వాహనాల మరమ్మతుల రూపంలో జేబుకు చిల్లుపడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు వసూలు చేయడంపై పెట్టిన శ్రద్ధ రోడ్ల మరమ్మతులపై కూడా చూపాలని మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే తప్పా.. వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎవరూ తమ ప్రాంతానికి రావడం లేదని.. సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
"ఈ ప్రాంతంలో రోడ్లు అడుగుకో గొయ్యి, గజానికో గుంతతో అధ్వానంగా ఉన్నాయి. గడప దాటి రోడ్డెక్కితే చాలు అది ఏ దారైనా అంతా గతుకులమయంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణమంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొడాలి నుంచి రామనగరం వరకు 15కిలోమీటర్ల మేర రోడ్డు అస్తవ్యస్థంగా తయారైంది. ఈ రహదారికి అనుసంధానంగా 10కి పైగా గ్రామాలు ఉన్నాయి. దీంతో నిత్యం గ్రామీణ ప్రాంతాల నుంచి అవనిగడ్డకు రాకపోకలు సాగించే విద్యార్థులు, ప్రయాణికులు మూడేళ్లుగా నానా అవస్థలు పడుతున్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఎన్నిసార్లు అధికారులను కోరినా.. నిధులు కొరత ఉందని చెబుతున్నారు. దీంతో మేము రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా.. 'మా రహదారులకు దిక్కెవరు' అంటూ బ్యానర్ పట్టుకుని నిరసన చేపట్టాము." - స్థానికులు