Crop Loss Compensation Issue In Krishna District : మిగ్జాం తుపాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారుగా 3 లక్షల ఎకరాల్లో పైగానే పంట నీట మునిగింది. గతేడాది భారీ వర్షాలకు పంటలు దెబ్బతింటే పెట్టుబడి రాయితీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం రైతులకు బీమా నామమాత్రంగానే అందించింది. తుపాను నేపథ్యంలో ఈ ఏడాది రైతులు పంటల బీమాపై ఆశలు పెట్టుకున్నప్పటికీ వారి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయన్నది అనుమానంగానే ఉంది.
రైతు కష్టాన్ని తుపానుకు అప్పజెప్పిన జగన్ - తడిసిన ధన్యాన్ని మద్దతు ధరకు కొనాలి : దేవినేని
Tenant Farmers Problems To Get Crop Loss Compensation : చేతికి వచ్చిన పంటను మిగ్జాం తుపాను తన్నుకుపోయింది. వరిపైరు పూర్తిగా నేలవాలి గింజలు మొలకెత్తుతున్నాయి. తుపాను వీడి వారం రోజులైనా నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు రాలేదు. ప్రభుత్వం అందించే పరిహారం, బీమాపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. పంటనష్టాన్ని మూడురకాలు లెక్కించాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం అందించే బీమా పరిహారం కేవలం నిలుపుదల మీదనున్న పంటకేనని చెబుతున్నారు. పనల మీదున్న వరి పంటకు తడిసిన ధాన్యానికి బీమా వర్తించదంటున్నారు. ప్రభుత్వం దయతలిస్తే పెట్టుబడి రాయితీ కింద విత్తనాలను 80 శాతం రాయితీతో అందిస్తామంటున్నారు. ఇదీ ఐదెకరాల లోపే దీంతో కర్షకులకు ఒరిగేదేమీ ఉండదని పెదవి విరుస్తున్నారు.
'బీమా అందాలంటే ప్రతి రైతు ఈ-క్రాప్ చేసి ఈకేవైసీ అయిఉండాలి. బీమా పరిహారానికి గతంలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే ప్రస్తుతం మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు. ఒక గ్రామంలో 33 శాతం కంటే నష్టం తక్కువ ఉంటే పంట నష్టాన్ని వర్తింపజేయరు. వర్షపాతం, దిగుబడి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతంలో పంట రుణం తీసుకున్నప్పుడే బీమా ప్రీమియాన్ని రైతుల నుంచి తీసుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత బీమా పేరుతో అసలుకే ఎసరుపెట్టింది.' -బాధిత రైతులు
మొలక ధాన్యానికి మేలైన ధర దొరికేనా? అన్నదాతకు ఈరట కలిగేనా?
'ఈ ఏడాదీ కౌలు రైతులే అధికంగా నష్టపోయారు. పరిహారం, బీమా అందుకోవడంలో మాత్రం వెనుకబాటు తప్పడం లేదు. కృష్ణా జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే. కేవలం 40వేల మంది మినహా మిగిలిన కౌలు రైతులకు ఈ-క్రాప్ యజమాని పేరు మీద నమోదు చేస్తున్నారు. ధాన్యం అమ్ముకోవాలన్నా కౌలు రైతులకు ఇబ్బందే. అప్పులు చేసి కొందరు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి మరీ సాగుచేసినప్పటికీ కాలం కలిసిరాలేదు. కౌలు రైతులను అదుకునేలా చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.' -జమలయ్య, ప్రధాన కార్యదర్శి కౌలు రైతుల సంఘం
పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని బాధిత రైతులు, రైతు సంఘ నాయకులు వేడుకుంటున్నారు.
ప్రకృతి విపత్తుకు తోడైన పాలకుల నిర్లక్ష్యం- రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం