కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. వంశపారంపర్యంగా వస్తున్న కళను అంతరించిపోకుండా జీవితాల్ని ధార పోస్తున్న కళాకారులు.. కరోనా కారణంగా 16 నెలలుగా ప్రదర్శనలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనం సాగించడం కూడా కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక అంశాలు, పథకాలపై నిర్వహించిన ప్రదర్శనలకు సంబంధించిన రూ.23 కోట్ల బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో కళాకారులు సాంస్కృతిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
2వేల కుటుంబాలకు ఆధారం
రాష్ట్రంలో సుమారు 2వేల కుటుంబాలు కళనే నమ్ముకొని జీవిస్తున్నాయి. కొన్ని కళా బృందాలు సాంస్కృతిక శాఖ, జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖల అనుమతితో సామాజిక అంశాలు, ప్రభుత్వ పథకాలపై 2018 ఆగస్టు నుంచి 2019 ఆగస్టు వరకు ప్రచారం నిర్వహించాయి. సాంస్కృతిక శాఖ అనుమతితో సామాజిక అంశాలపై నిర్వహించిన ప్రదర్శనలకు సంబంధించి రూ.12.10 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయని కళాకారులు అప్పులు చేసి, ఈ ప్రదర్శనలు నిర్వహించారు. ఇవే కాకుండా కొన్ని కళాసమితులు నాటిక పోటీలూ నిర్వహించాయి. చాలా సమితులు బిల్లులు వచ్చాక పారితోషికం ఇస్తామని కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించాయి. ఈ బిల్లులూ పెండింగ్‌లోనే ఉన్నాయి.
- సాంస్కృతిక శాఖ ఆదేశాలతో సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జానపద కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు. ఒక్కో కళాకారుడికి రోజుకు రూ.వెయ్యి చొప్పున పారితోషికం చెల్లించాలి. ఈ బకాయిలు రూ.11.07 కోట్లు ఉన్నాయి.
కళను నమ్ముకున్నందుకు అర్ధాకలే మిగిలింది
కరోనా కారణంగా 16 నెలలుగా ఎలాంటి ప్రదర్శనలు లేవు. ప్రభుత్వం నుంచి రెండేళ్లుగా బిల్లులు రాలేదు. కళాసంస్థలు, జానపద కళాకారులు అందరూ పేదవారే. అర్ధాకలితో బతకాల్సి వస్తోంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించి ఆదుకోవాలి.
- బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి, అధ్యక్షుడు, బళ్లారి రాఘవ సమితి
ఇదీ చదవండి