పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు, యనమలకుదురు, వణుకూరుల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌పై వివాదం జరుగుతోంది. ఈవీఎంల అప్పగింతకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన సమాధానానికి ఎన్నికల సంఘం అధికారులు నివ్వెరపోయారు. నిద్రపోయాం... ఆలస్యమైందంటూ బాధ్యత కలిగిన రిటర్నింగ్ అధికారి చెప్పటంతో ఈవీఎంలు తీసుకునేందుకు తొలుత నిరాకరించినా... ఆ తర్వాత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈవీఎంల అప్పగింత జాప్యంపై ఆ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమాధానం బాధ్యతారాహిత్యంగా ఉందని ఎన్నికల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 3 రోజులుగా నిద్ర లేదని... అందుకే జాప్యం అయిందని ఆర్వో వివరణ ఇచ్చినట్లు సమాచారం.
పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ ఈవీఎంలు మొరాయించిన ఘటనలు నమోదు కాలేదు. కేవలం 2 కంట్రోల్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌నే మార్చాల్సి వచ్చింది. కానూరులో ఒకటి, యనమలకుదురులో రెండు, వణుకూరులో ఒక పోలింగ్ కేంద్రంలో అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. స్ట్రాంగ్‌రూంలు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు. 11న అర్థరాత్రిలోపే పోలింగ్ ముగిస్తే... తెల్లారి రాత్రి 9 గంటలకు ఈ పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంకు వెళ్లాయి. అయితే ఈ అంశం తమ దృష్టికి రాలేదని... ఈసీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని ఉన్నాతాధికారులు చెబుతున్నారు.
మచిలీపట్నం స్ట్రాంగ్‌రూంల నుంచి ఈవీఎంల తరలింపు వ్యవహారంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. స్ట్రాంగ్‌రూంల నుంచి ఈవీఎంలను ఎందుకు తరలించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కోంది. ఏఆర్వోగా ఉన్న నూజివీడు తహసీల్దార్ పి.తేజేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.