Construction Condition of Jagananna Colonies: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న కాలనీల నిర్మాణాలు కృష్ణా జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణం చేపట్టకుంటే స్థలాలు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వ బెదిరింపులతో లక్షల రూపాయలు అప్పులు చేసి పనులు ప్రారంభించినా.. సగంలోనే నిలిచిపోయాయి. ఊరికి దూరంగా ఏర్పాటు చేసిన కాలనీలకు వెళ్లాలంటేనే లబ్ధిదారులకు ప్రహాసనంగా మారింది.
రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో.. అక్కడ పూర్తిస్థాయిలో నివాసం ఉండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో జగన్న కాలనీల్లో నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు మొలిచి కాలనీలు చిట్టడవిని తలపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో లక్షా 76వేల ఇళ్లు కేటాయించగా.. కేవలం 13వేల 650 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. పెరిగిన ధరలతో ప్రభుత్వం ఇచ్చే సాయం ఏమాత్రం సరిపోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
కృష్ణా జిల్లా గొడవర్రులో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు కేటాయించడంతో చిన్నపాటి వర్షానికే కాలనీ జలమయమవుతోందని స్థానికులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణం చేపట్టలేక పునాదుల దశలోనే వదిలేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలనీల్లో పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణం పూర్తి చేయకుంటే..స్థలాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయల ఖర్చవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కనీసం మేస్త్రీ, కూలీలకు కూడా సరిపోవడం లేదని తెలిపారు.
ఇవీ చదవండి: