CM YS Jagan Sabha in Vidyadharapuram : వైఎస్ ఆర్ వాహన మిత్ర పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడ విద్యాధర పురంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు ఆర్థిక సాయం విడుదల చేశారు. 2లక్షల 75 వేల 931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం విడుదల చేశారు.
బతుకు బండి లాగేందుకు ఇబ్బందులు పడే ఆటో డ్రైవర్లకు బాసటగా నిలిచేందుకు వైఎస్ ఆర్ వాహనమిత్ర పథకం అమలు చేస్తున్నామన్న సీఎం.. వాహనాల ఫిట్ నెస్, మరమ్మతులకు ఇబ్బందులు పడుతున్నందునే వారికి మంచి చేసేందుకు ఈ పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. ఫిట్ నెస్ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం సహా వాహనం మరమ్మతుల కోసం ప్రతి ఆటో, టాక్సీ డ్రైవర్ కు ఏటా 10 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏట 2 లక్షల 75 వేల 931 మంది కి 276 కోట్లు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.
వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ , ఇన్సురెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. వాహనంలో మీ వెనుక ఉన్న ప్రయాణికుల భద్రతను మరచిపోవద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. పేదల కష్టాలు, కన్నీళ్లు తుడి చేందుకు మీ అందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న సీఎం.. దీనికోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు, మహిళలు, చేనేతలు సహా పలు వర్గాలకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరోటి లేదన్నారు.
ప్రతి అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ సభగా మార్చేసే సీఎం జగన్.. ఈసారి కూడా సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. నీతి వంతమైన ప్రభుత్వానికి, అవినీతి, సామాజిక అన్యాయాలు చేసిన ప్రత్యర్థులకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. గతంలో కంటే అప్పుల పెరుగుదల శాతం కూడా తక్కువేనని సీఎం అన్నారు.
గతంలో ఎందుకు ఈ డబ్బులు రాలేదని, ఎవరి జోబుల్లోకి వెళ్లిందో ఆలోచించాలని కోరారు. విపక్షాలకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి.. పంచుకోవడానికేనని ధ్వజమెత్తారు. వాళ్లలా తనకు గజదొంగల ముఠా, దత్త పుత్రుడు అండగా లేరని, దోచుకోవడం.. పంచుకోవడం.. తినుకోవడం తన విధానం కాదన్నారు. జరిగిన మంచినే కొలమానంగా తీసుకుని వచ్చే ఎన్నికల్లో తనకు అండగా నిలబడాలని సూచించారు. తన ప్రసంగంలో పలు మార్లు యుద్దం.. యుద్దం అని సీఎం జగన్ పదే పదే పేర్కొనడంపై.. సభకు వచ్చిన వారిలో కొందరు ఆసహనం వ్యక్తం చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎర్రకట్ట వద్ద 7 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పశ్చిమ నియోజకవర్గంలో రెల్లి సామాజిక వర్గం కమ్యునిటీ భవనానికి 50 లక్షలు, మసీదుల అభివృద్దికి 3.5కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ శ్మశానవాటిక, కాపు సంక్షేమ భవనానికి స్థలం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
అధికారిక కార్యక్రమంలో తప్పకుండా ప్రొటో కాల్ పాటించాల్సి ఉండగా దాన్ని విస్మరించారు. విజయవాడ లో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎంపీ కేసినేని నానిని ప్రభుత్వం కనీసం ఆహ్వానించలేదు. స్టేజీపై ఎంపీ కోసం సీటు తప్పక కేటాయించాల్సి ఉండగా అలా చేయలేదు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మాత్రం ముందు వరుసలో సీటు కేటాయించారు. మాజీ మంత్రి పేర్ని నాని సీఎంతో పాటు వేదిక పైకి వచ్చినా ఎమ్మెల్యేలతో సమానంగా ముందు వరుసలో సీటు కేటాయించలేదు. వేదిక పై బాలశౌరి ఉండటంతో వెనుక సీట్లో కూర్చోలేక, ఎంపీతో కలసి వేదిక పంచుకోవడం ఇష్టంలేక వేదిక దిగి వెళ్లిపోయారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో జరిగే ప్రతి సభకూ తప్పక హాజరయ్యే మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగ సభకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేశ్ కనీసం పలుకరించుకోలేదు. పాఠశాల బస్సులను ఇతర అవసరాలకు వినియోగించకూడదని నిబంధనలు ఉన్నా.. వాటిని విస్మరించి... నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున పాఠశాలల బస్సులు ఏర్పాటు చేసి జనాలను బలవంతంగా తరలించారు. వచ్చిన వారంతా సీఎం ప్రసంగానికి ముందు కొందరు... ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో మహిళలు సభా ప్రాంగణాన్ని వీడి బయటకు వెళ్లిపోయారు. వీరిని ఆపేందుకు పోలీసులు సముదాయించినా, బుజ్జగించినా వినకుండా బయటకు వెళ్లిపోయారు.
సీఎం సభకు వచ్చి ఇబ్బందుల్లో విద్యార్థులు.. ముందే ట్యాబ్ల పంపిణీ