తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం దిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమయమిచ్చినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఐదుగురు నేతలకు సమయమిచ్చినట్లు వెల్లడించాయి. మాదకద్రవ్యాలకు, గంజాయికి రాష్ట్రం అడ్డాగా మారిందని, ప్రభుత్వంలోని వ్యక్తులే దాన్ని ప్రోత్సహిస్తున్నారని, శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న తెదేపా.. అదే విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రపతి పాలన విధించాలని కోరనుంది.
చంద్రబాబు ఈ ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రపతితో భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలతోపాటు భవిష్యత్ కార్యాచరణపైనా చర్చించారు. సోమ, మంగళ వారాల్లో పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు.
రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం: పయ్యావుల
‘‘ఏపీలో అరాచకాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం. ప్రధాని, కేంద్ర హోంమంత్రి సమయం కూడా కోరాం. ఎన్టీఆర్ భవన్‌పై దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరతాం. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తెదేపా ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు’’ అని తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు.
ఇదీ చూడండి: KRMB Subcommittee : శ్రీశైలంలో కృష్ణాబోర్డు ఉపసంఘం భేటీ.. ఎప్పుడంటే?