Chandrababu: వైకాపా ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్సే చివరి అవకాశంగా చేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. 175 నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, 25 పార్లమెంట్ స్థానాల ఇంఛార్జ్‌లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పనిచేయని నేతలను ఉపేక్షించనని హెచ్చరించారు.
వైకాపా పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు న్యాయం కోసం పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా నిలవాలని సూచించారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు.
జగన్ రెడ్డి అసమర్థ , స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా రౌడీయిజం, సెటిల్ మెంట్లపై గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి దగ్గర డబ్బు, అధికారం ఉంటే... తెదేపాకు ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తితిదే బోర్డు నిర్ణయాలతో భక్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. త్వరలోనే ఆన్ లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తెదేపా 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడుకు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు.
‘వివేకా హత్యపై జగన్ వైఖరితో ఆయన నైజం ఏంటో అర్థమైంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. వైకాపా నేతల మైనింగ్ అక్రమాలపై అయిదు నియోజకవర్గాల్లో చేసిన పోరాటాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. ‘వైకాపా ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వారి అక్రమాలపై తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు గళమెత్తాలి’ అని సూచించారు.
పని చేయని నేతలను పార్టీ భరించదు
పార్టీ సంస్థాగత నిర్మాణం, త్వరలో చేపట్టనున్న సభ్యత్వ నమోదుపై చంద్రబాబు చర్చించారు. పనిచేయని నాయకుల్ని పార్టీ భరించబోదని ఆయన పునరుద్ఘాటించారు. ‘అధిష్ఠానం సహనానికీ ఒక హద్దుంటుందని నాయకులు గుర్తించాలి. పని చెయ్యనివారి విషయంలో కఠిన చర్యలకు వెనుకాడం. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. అన్నింటికీ నేతలు సిద్ధంగా ఉండాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. గ్రామ, మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు, మహానాడు నిర్వహణపై పొలిట్‌బ్యూరోలో చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు శ్రీవారిని దూరం చేసేలా తితిదే నిర్ణయాలు తీసుకుంటోందని, దీనిపై భక్తుల్లో అసంతృప్తి ఉందని పార్టీ నేతలు వివరించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మరణానికి తెదేపా సమావేశం సంతాపం తెలిపింది.
ఇదీ చదవండి
Gowtham Reddy No More: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత.. ఎల్లుండి అంత్యక్రియలు