యాచక వృత్తిని జీవనోపాధిగా చేసుకొని జీవిస్తూ... భగవంతుడికి ఆభరణాలు చేయించి దాతృత్వం చాటుకున్నాడు ఓ వ్యక్తి. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ శిరిడి సాయి బాబా ఆలయం ఎదుట తెలంగాణకు చెందిన యాదిరెడ్డి అనే వ్యక్తి యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. అక్కడికి వచ్చే భక్తులు తనకు ఇచ్చే మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తన దాతృత్వం చాటుకుంటున్నాడు. ఇటీవల శ్రీ దత్తాత్రేయ స్వామికి వెండి కిరీటం ఆభరణాలు చేయించాడు. నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సేకరించడం, ఆలయ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం చేస్తూ... ఎంతోమందికి తన వంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల ఆలయ ప్రాంగణంలో గోశాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేశాడు. యాచక వృత్తితో జీవనం సాగిస్తూ... తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం గొప్ప విషయమని ఆలయ ట్రస్టు ఛైర్మన్ గౌతంరెడ్డి.. యాదిరెడ్డిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ 'మానవసేవే-మాధవసేవ'గా భావించి ఎంతో కొంత ఇతరులకు సాయపడాలని అన్నారు.
ఇదీ చూడండి: