BENEFICIARIES REJECTS SITES IN JAGANANNA LAYOUTS : జగనన్న లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకోలేమని దాదాపు లక్ష మంది లబ్దిదారులు తేల్చి చెప్పేశారు. ఆ లే అవుట్లలోని ఇళ్లస్థలాలు తమకు వద్దంటూ తిరస్కరించారు. శ్మశానాలకు దగ్గరగా ఉండటం, ఆవాసయోగ్యంగా లేకపోవటం, బురద, ముంపు ప్రాంతాలు కావటం వంటి వివిధ కారణాలతో 95వేల 106 మంది లబ్దిదారులు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను తిరస్కరించారు.
గృహనిర్మాణ అధికారులు పదేపదే లబ్ధిదారుల వద్దకు వెళ్లి నిర్మాణాలపై ఒత్తిడి చేస్తుండటంతో వీరు ఇళ్లస్థలాలు వద్దని తేల్చిచెప్పేశారు. జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమావేశంలోనూ ఈ ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ స్థలాలను చూడాలంటూ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.
జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన నడుస్తోంది. 2 లక్షల స్థలాల్లో.. ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ మొదలు కాలేదు. మిగతా 16లక్షల 67 వేల స్థలాల్లో నిర్మాణం మొదలైనా ఇప్పటికీ 60 శాతం మేర నిర్మాణం పునాదుల వరకే ఉంది. 6 లక్షల 96వేల ఇళ్లు బేస్‌మెంట్ స్థాయికి చేరాయి. ఇక ఇప్పటివరకూ నిర్మాణం పూర్తైన ఇళ్లు కేవలం 2లక్షల 9వేలు మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులపై ఎంత ఒత్తిడి చేస్తున్నా వారు ముందుకు రావట్లేదు. నిర్మాణానికి ఇస్తున్న లక్షా 80వేల రూపాయలు సరిపోవనే ఎక్కువమంది ఆసక్తి కనబరచడం లేదు. లబ్ధిదారులు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాలకు చాలా దూరంగా ఇళ్లస్థలాలు కేటాయించడం కూడా మరో కారణం. పట్టాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా చాలామంది స్పందించట్లేదు.
క్షేత్రస్థాయి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నా ఇళ్ల విషయంలో ఆశించినంత పురోగతి లేదు. కలెక్టరు నుంచి గృహనిర్మాణ శాఖ ఏఈ వరకూ ప్రతి శనివారం కాలనీల్లో పర్యటిస్తున్నా ఫలితం ఉండట్లేదు. నవంబరు నెలాఖరుకు లక్షా 12వేల మందికి కేటాయించిన ఇళ్లను వివిధ కారణాలతో రద్దు జాబితాలో చేర్చారు. దీనిపై గృహ నిర్మాణశాఖ అధికారుల్ని వివరణ కోరగా.. నివాస ప్రాంతాలకు దూరంగా, శ్మశానాల పక్కన ఇచ్చినవారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: