వైకాపా, తెదేపాలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీసీల ఓట్ల కోసం వైకాపా, తెదేపాలు డ్రామాలు ఆడుతున్నాయని... బీసీల నిజమైన నేస్తం కాంగ్రెస్ మాత్రమే అని తులసి రెడ్డి అన్నారు. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో గురువారం విజయవాడలో ప్రదర్శన జరపాలనుకోవడం హాస్యాస్పదమన్నారు.
కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల మందికి స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. జగన్ 17 నెలల పాలనలో ఒక్క బీసీకి కూడా స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం చేయలేదన్నారు.
నిధుల్లేక బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైందని... నిధులు లేని కార్పొరేషన్లు ఎన్ని ఉన్నా లాభం ఏంటని ప్రశ్నించారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదని.. జగన్ పాలనలో కార్పొరేషన్లకు నిధులు ఉండవని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు బీసీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని ఆరోపించారు. బీసీల పట్ల జగన్కు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్ష పదవిలో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.