రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి పాలిసెట్-2020 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. విజయవాడలోని సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎంఎం నాయక్ ఫలితాలను విడుదల చేశారు.
గతనెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 388 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 88,372 మంది విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోగా... 71,631 మంది పరీక్ష రాశారు. వీరిలో 60,780(84.85) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 42,313 మంది, బాలికలు 18,467 మంది ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మట్టా దుర్గాసాయి కీర్తితేజ(120) మొదటి ర్యాంకు సాధించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ్ ప్రణీత్ (119) రెండో ర్యాంకు, సవితల శ్రీదత్త శ్యామసుందర్ (118) మూడో ర్యాంకు సాధించారు.
నవంబర్ నుంచి తరగతులు
కౌన్సెలింగ్ ప్రక్రియకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. ఈనెల 12 నుంచి 16 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఈనెల 12 నుంచి 18 వరకు విద్యార్థులు తమ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువు నిర్ణయించారు. ఈనెల 20వ తేదీన సీట్ల వివరాలు ప్రకటిస్తారు. ఈనెల 21 నుంచి 27లోగా ఆయా విద్యార్ధులు వారు ఎంపిక చేసుకున్న పాలిటెక్నిక్ కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభం అవుతాయి. మొదటి సంవత్సరంతోపాటు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకూ నవంబరు మొదటి వారంలోనే తరగతులు ప్రారంభించాలని యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిందని... రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుమతించిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎంఎం నాయక్ తెలిపారు.
పాలిసెట్-2020 ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
ఇదీ చదవండి: సీ హారియర్ ప్రదర్శనశాలగా రాజీవ్ స్మృతి భవన్