social media posts against judges case: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టుల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేసి అభియోగపత్రం దాఖలు చేశామని, మిగిలిన నిందితులపై దర్యాప్తును 15 రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపింది. కొంతమంది నిందితుల విచారణకు..... కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరామని వివరించింది. ఆ అనుమతులపై దర్యాప్తు ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... విచారణను మార్చి 21 కి వాయిదా వేసింది.
దర్యాప్తు పురోగతిపై స్థాయీ నివేదికను సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సోమవారం జరిగిన ఈ కేసు విచారణలో హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు కొనసాగించారు. ఈ కేసులో నిందితుడు పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ వర్చ్యువల్ ప్రైవేటు నెట్‌వర్క్ ద్వారా అభ్యంతరకర వీడియోలను..అప్లోడ్ చేస్తున్నారని వివరించారు. ఎవరైనా ఆ వీడియోలను వీక్షించేందుకు విజ్ఞప్తి పెడితే..అనుమతిస్తున్నారని తెలిపారు. అలాంటి వీడియోలను బ్లాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూట్యూబ్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ వీపీఎన్ విధానంలో అప్లోడ్ చేసిన వీడియోలను అడ్డుకునే అంశాన్ని తదుపరి విచారణలో కోర్టుకు తెలియజేస్తామన్నారు. సాంకేతికంగా సాధ్యమైతే తొలగిస్తామన్నారు.
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలు వినిపిస్తూ .. పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటి వరకు 33 మందిపై కేసులు నమోదు చేశామన్నారు . 11 మందిపై అభియోగపత్రం చేశామన్నారు . కొంతమంది విషయంలో చర్యలు తీసుకునేందుకు తగినంత సమాచారం లభ్యంకాలేదన్నారు.
కౌంటర్ దాఖలు చేయండి.. సీబీఐకి ఆదేశాలు
పంచ్ ప్రభాకర్ అరెస్టుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్‌కు అమెరికా పౌరసత్వం ఉందని.. అరెస్టు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని సీబీఐ తెలిపింది. కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేశామని చెప్పింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ వేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:
గౌతమ్ రెడ్డి సమర్థంగా పని చేశారు.. ఆయన ఆకస్మిక మరణం బాధాకరం - చంద్రబాబు