రెండో దశలో కొవిడ్ వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. అయినా ప్రజల్లో సామాజిక స్పృహ రావడం లేదు. ఒకవైపు పరీక్షలు, చికిత్సల కోసం బారులు తీరుతున్నా మరోవైపు మార్కెట్లలో రద్దీ ఉంటోంది. మాస్క్‌లు లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారు. నారాయణపురం కాలనీలో ఒక అపార్టుమెంటులో ఒక వ్యక్తికి కోవిడ్ సోకిందని ఆయన బయటకు రాకుండా తాళం వేశారు. రోగులకు సహకరించాల్సింది పోయి నిర్బంధానికి పాల్పడ్డారు. ఉపాధ్యాయులైన భార్యాభర్తలు కొవిడ్ బారిన పడి మృతి చెందారు. వారి పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
ఇంట్లో ఒకరికి వస్తే...
కరోనా రెండో దశలో కుటుంబంలో ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే మిగిలిన సభ్యులకు వ్యాప్తి చెందుతోంది. అంత తీవ్రంగా ఉంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారికి లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. పరీక్షలు నిర్వహిస్తేనే బయట పడుతున్నాయి. కానీ ఈలోగా నష్టం జరిగిపోతోంది. కుటుంబంలో మిగిలిన వృద్ధులు, పిల్లలకు వ్యాప్తి చెందుతోంది. కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే మిగిలిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాల్సి ఉంది. కానీ ప్రభుత్వపరంగా ఆ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారికి తీవ్రత పెరిగిన తర్వాత ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.లక్షల బిల్లులు సమర్పించాల్సిన పరిస్థితి వస్తోంది. ఓ గుత్తేదారుకు ఇటీవల కరోనా సోకితే నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆయనను చూసేందుకు బంధువులకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆ గుత్తేదారు ఇద్దరు కూతుళ్లు, అల్లుడు, కొడుకు వైరస్ బారిన పడ్డారు. ఆయన పరిస్థితి క్లిష్టంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు. ఆయన అక్కడ మృతి చెందారు. కుటుంబీకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కొద్దిమంది బంధువులు ఆయన అంత్యక్రియలు చేశారు.
● ప్రభుత్వ డెంటల్ ఆస్పత్రిలో ట్రైఏజ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించి కిట్ అందిస్తారు. తీవ్ర జాప్యం చేస్తున్నారు.
● అపార్టుమెంట్లలో నివాసం ఉండేవారి పరిస్థితి దారుణంగా ఉంది. బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. వ్యాప్తి విస్తృతంగా ఉండడంతో ఏ ఒక్కరికి వచ్చినా అందరికి సోకుతుందనే ఆందోళనలో ఉన్నారు.
విజయవాడ ఒకటో పట్టణంలో ఓ న్యాయవాది కుటుంబంలో కరోనా సోకి నలుగురు మృతి చెందారు. కేవలం రెండు రోజుల్లో తల్లిదండ్రులు, న్యాయవాది, ఆయన చిన్నాన్న మృతి చెందారు. వీరంతా నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దాదాపు వారం పాటు చికిత్స పొందిన వారే. నలుగురికి దాదాపు రూ.25లక్షలకు పైగా వైద్య ఖర్చు దాటింది. ఖర్చు పెరగడంతో న్యాయవాది అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా ఊపిరి నిలబడలేదు.
విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేవని ఓ రోగిని అంబులెన్సు వద్దే ఉంచి ఆక్సిజన్ అందించారు. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్లు వచ్చి పల్స్ చూసి వెళ్లిపోయారు. సాయంత్రం 4గంటల వరకు ఆయన ఆస్పత్రి బయటే ఉన్నారు.
ఆరుబయటే...
ఓ గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులకు కరోనా సోకిందని జిల్లా ఆస్పత్రికి గురువారం తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే అంబులెన్సులో ఉన్నారు. పడకలు లేవని ప్రవేశం ఇవ్వలేదు. సాయంత్రం పరిస్థితి క్లిష్టంగా మారుతోందని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రిలో కనీసం రోజుకు రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు బిల్లులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు ఇంతమొత్తం భరించే పరిస్థితి లేదు.
కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న తర్వాత పరీక్షలు చేయించుకుంటే.. వెంటనే ఫలితాలు వచ్చేలా చూడాలి. కానీ వారం రోజులు పడుతుంది. జగ్గయ్యపేటకు చెందిన న్యాయవాది పరీక్ష చేయించుకుంటే వారం గడిచినా ఫలితం రాలేదు. గురువారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు. 24 గంటల్లో ఫలితం వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. వెంటనే ఐసోలేషన్ కిట్ అందించాలి.
కరోనా నిర్ధారణ అయిందని తెలిస్తే రవాణాకు కూడా ముందుకు రావడం లేదు. అంబాపురంలో ఓ సర్పంచి ఆటో డ్రైవర్‌గా మారి మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన దీనికి ఉదాహరణ.
ఇవీ చూడండి…