కృష్ణా జిల్లాలో వచ్చే రబీ సీజన్‌కు 31 టీఎంసీల నీటిని అందించాలని నీటిపారుదల సలహా మండలి నిర్ణయించింది. మొత్తం లక్షా 55 వేల 900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని మండలి పేర్కొంది. ఈ ఏడాది నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నందున వరి సాగు విస్తీర్ణం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అదనపు నీటి కేటాయింపులు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జిల్లా 33వ నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు.. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి రూ.204 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, కలెక్టర్ ఇంతియాజ్, సంయుక్త కలెక్టర్ మాధవీలత నీటిపారుదల ఇంజినీర్లు పాల్గొన్నారు.
రబీలో ఏ రకం వరి వంగడాలు వేయాలనేది అధికారులు ప్రకటించారని... వాటిని మాత్రమే పండించాలని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. అప్పుడే ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. జిల్లాలో ఇటీవల వరదలు, తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు త్వరగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. నివర్ తుపాను కారణంగా 64 వేల హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారుల నుంచి ప్రాథమిక అంచనాల అందాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మరో రెండు రోజుల్లో మొత్తం పరిస్థితులపై నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు.
ఇదీచదవండి...