Woman Priest in Krishna District : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లిన పురుష అర్చకులే ఉంటారు. కానీ కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలోని శ్రీ విశ్వేశ్వరాలయంలో 42 సంవత్సరాలుగా మహిళ పూజారిగా పని చేస్తున్నారు. ఆమె విజయలక్ష్మి.
కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ విశ్వేశ్వరాలయంలో వంశపారంపర్యంగా విజయలక్ష్మి కుటుంబీకులు అర్చకత్వం నిర్వహించేవారు. విజయలక్ష్మి తండ్రి ఘంటసాల వెంకటేశ్వరరావుకు నలుగురు కుమార్తెలు.. మగపిల్లలు లేకపోవటంతో విజయలక్ష్మి, మాధవీలత ఇద్దరు అవివాహితులుగా ఉన్నారు. విజయలక్ష్మి ఎంఏ బీఈడీ చదివి, బాషా ప్రావీణ్యంలో ఉత్తీర్ణత సాధించి అర్చక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. తండ్రి మరణాంతరం ఆలయ అర్చక బాధ్యతలు స్వీకరించి 42 ఏళ్లుగా పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అభిషేకం, అష్టోత్తర నామాలు, అమ్మవారికి లలితా సహస్రనామాలు ఇలా అన్ని పూజలు చేస్తానని ఆమె తెలిపారు. గ్రామంలో వివాహాలు, పూజలు, వ్రతాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మహా శివరాత్రికి, దసరా ఇలా ముఖ్యమైన పండగలు సమయంలో ప్రత్యేకించి అర్చకులను పిలుస్తానని తెలిపారు. హిందూ ధర్మ శాస్త్రోక్త ప్రకారం భక్తులకు పరిష్కారాలు తెలియజేస్తున్న మన్ననలు పొందుతున్నారు.
ఘంటసాల గ్రామంలో ఏడు తరాల నుంచి నివాసం ఉంటున్నట్లు అర్చకురాలు విజయలక్ష్మి తెలిపారు. గ్రామంలో విశ్వేశ్వరాలయంతో పాటు మరో ఆలయంలో కూడా వారి తాత, నాన్న పూజలు నిర్వహించినట్లు ఆమె వివరించారు. మనసు ప్రశాంతత కోసం ప్రస్తుత ఆలయంలో పూజదికాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎండోమెంట్ ఆధ్యర్యంలో ఎనిమిది సంవత్సరాలు గ్రామంలోని మరో ఆలయమైన జగదీశ్వరాలయంలోనూ అర్చనలు నిర్వహించానని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని ఆమె కోరిక అని తెలిపారు. ఆడవాళ్లు బలహీనులు కాదని.. అన్ని రంగాల్లోనూ ముందున్నారన్నారు.
"ఆడవాళ్లు దేనికి తీసిపోరు. అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మహిళలు అర్చకత్వం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. దుర్గాభాయ్ యాక్ట్ ప్రకారం మహిళలు అర్చకత్వం చేసే హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారమే పట్టుదలతోనే చేస్తున్నాను." - విజయలక్ష్మి, ఘంటసాల అర్చకురాలు
సుదీర్ఘంగా గ్రామంలో పూజది కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయలక్ష్మిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. చిన్నతనం నుంచి అర్చకత్వం నిర్వహిస్తూ.. భక్తుల మన్ననలు పొందుతున్న విజయలక్ష్మిని స్థానికులు, గ్రామస్తులు శాలువాతో సత్కరించారు. గ్రామంలో ఏ శుభకార్యానికైన విజయలక్ష్మిని ఆహ్వానిస్తామని, ఆమె చెల్లెలు మాధవీలత కూడా మరో దేవాలయంలో అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
"విజయలక్ష్మి, మాధవిలత కూడా వీరిద్దరూ అన్ని అభిషేక, అర్చక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకు తెలిసినప్పటి నుంచి వీరే నిర్వహిస్తున్నారు. వీరు ప్రముఖ ఘంటసాల కుటీంభీకులు. ఘంటసాల మా గ్రామానికి వచ్చినప్పుడు వీరిని కలవటం మాకు తెలుసు." -రామకృష్ణ, ఘంటసాల వాసి
ఇవీ చదవండి :