విజయవాడ సత్యనారాయణపురంలో కలకలం రేపిన హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. హత్య జరిగిన రోజు నిందితుడు ప్రదీప్‌తోపాటు అతని అన్న, బావ కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారని మృతురాలు మణిక్రాంతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు సైతం దీనికి బలం చేకూర్చేలా ఉండటంతో... పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రదీప్ తల్లి, సోదరి... అతడు హత్య చేసేందుకు ప్రేరేపించారని మృతురాలి బంధువులు ఆరోపించటంతో పోలీసులు వారిని సైతం విచారిస్తున్నట్లు సమాచారం.
నిందితుడు ప్రదీప్ పక్కా పధకం ప్రకారమే మణిక్రాంతిని హత్య చేశాడని పోలీసులు తేల్చారు. శరీరం నుంచి తల వేరుచేసి కాలవలో పడేసి ఆధారాలు లేకుండా చేయాలని ప్రదీప్ భావించాడు. భర్తపై మణిక్రాంతి ఇప్పటివరకు ఆరుసార్లు ఫిర్యాదు చేసింది. ఏడాదిగా ప్రదీప్ జైల్లోనే ఉన్నాడు. తనను జైలుపాలు చేయడమే కాకుండా బెయిల్ రాకుండా అడ్డుకుంటుందని భార్యపై ప్రదీప్ కక్ష పెంచుకున్నాడు. బెయిల్ నుంచి బయటకు రాగానే మణిక్రాంతిని బెదిరించగా... ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన అతను ఆమెను అంతమొందించాడు. పోలీసులు తక్షణం స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
మణిక్రాంతి తల కోసం పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు కాలువలో గాలింపు చేపట్టారు. ఆమె మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు.