కరోనా బాధితులకు సహకారం అందించేందుకు ఏపీసీసీ తరుపున కొవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కష్ట కాలంలో అధికార పార్టీ నాయకులు మొహం చాటేస్తుండటం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.
సీఎం పట్టించుకోకపోవడం దారుణం..
కరోనా వ్యాప్తి నియంత్రణను అడ్డుకోవడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ ఇద్దరూ విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పది , ఇంటర్ పరీక్షలు నిర్వహించొద్దని ఒకవైపు తల్లిదండ్రులు కోరుతున్నా, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
చేతకాకుంటే చెప్పండి..
ప్రజల్లోకి వచ్చి బాధితులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత సీఎంగా జగన్పై ఉందన్నారు. బ్లాక్ మార్కెట్లో ఇంజక్షన్లు అమ్ముకుంటున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ వేయించడం చేతకాకపోతే చెప్పండి.. తాము వేయిస్తామని సవాల్ విసిరారు.
సర్కారుకు సిగ్గుచేటు..
ఆక్సిజన్ నిల్వలు తగినంత లేక ప్రాణాలు పోవడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. నీతులు చెప్పడం మాని వాస్తవాలను ప్రజలకు చెప్పండని హితవు పలికారు. అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పక్షానా డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం