Kapu leaders warned Mudragada: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరులో సుమారు వందమంది కాపు నాయకులు సమావేశమయ్యారు. పవన్ విమర్శల నేపథ్యంలో ముద్రగడ లేఖలు రాయడంపై భగ్గుమన్నారు. ఈ మేరకు ముద్రగడకు పలు ప్రశ్నలు సంధించారు. దయచేసి మన జాతిని తాకట్టు పెట్టవద్దు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమం వల్ల మీరు సాధించినది ఏమిటి..? అని ముద్రగడను నిలదీసారు. ఉద్యమం సమయంలో తామంతా సొంత ఖర్చులతో పాల్గొన్నామని తెలిపారు.
వైఎస్సార్సీపీని విభేదించిన ఇతర జాతి నాయకులను ఆ జాతి వారు విమర్శించక పోయినా.. కాపులను, పవన్ కల్యాణ్‌ను తిట్టేందుకు మాత్రం వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్నినాని, గుడివాడ అమర్నాథ్ తదితరుల చేత తిట్టించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మీరు ఏ పార్టీలోనైనా ఉండండి.. మీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం కాపు జాతిని మాత్రం కించపరచకండి అని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం వల్ల కాపుజాతికి ఒరిగిందేమీ లేదని తెలిపారు. తోట త్రిమూర్తులు కాపు జాతి ప్రయోజనాల కోసం పాటు పడ్డారని అన్నారు. "మీరు మాకు పెట్టిన ఉప్మా డబ్బులు మీకు తిరిగి పంపుతున్నాం.. మరొక్కసారి లెటర్లు రాస్తే మీ ఇంటికి వచ్చి మీకు బుద్దిచెపుతాం.. అమాయకులైన కాపులను ముందుపెట్టి కడప బ్యాచ్‌తో తునిలో రైలు దహనం చేయడం నిజం కాదా..?" అంటూ ముద్రగడను కాపు నేతలు ప్రశ్నించారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖల పరంపర కొనసాగిస్తున్నారు. ఇటీవలే లేఖ రాసిన ముద్రగడ.. మరోసారి మూడు పేజీల లేఖను రాస్తూ.. పలు కీలక విషయాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో.. 'మీ మీద నేను పోటీ చేయడానికి సవాలు విసరండి' అని పేర్కొన్నారు. కాకినాడ నుంచి పోటీ చేయడానికి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధమై.. ప్రత్యర్థి అభ్యర్థిగా తనకు సవాలు విసరాలని లేఖలో పేర్కొన్నారు. ఇంకా.. 'మీరు, మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం.. మీ బెదిరింపులకు భయపడి నేను లొంగను.. గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారంటూ రాశారు. దమ్ముంటే మీరు నన్ను డైరెక్ట్‌గా తిట్టండి.. నేను మీ బానిసను కాదు.. మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదు అని పేర్కొన్నారు. మీ అభిమానులు నాకు బండ బూతులు తిడితూ, మెసెజ్‌లు పెడుతున్నారు... మీరు సినిమాలో హీరో తప్ప రాజకీయాల్లో కాదు అని లేఖలో తెలిపారు.