Suicide Attempt: రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రోద్బలంతో కొందరు తమ భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద బుధవారం ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. తుని మండలం కేవో మల్లవరానికి చెందిన సుర్ల కొండలస్వామి (మరణించారు) కుటుంబానికి చెందిన 15 మంది కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు.
అందులో ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై, వారినుంచి డబ్బాలను లాక్కున్నారు. కొండలస్వామికి కేవో మల్లవరం పక్కనే ఉన్న దొండవాకలో 8.86 ఎకరాల భూమి ఉందని, దీనిలో నాలుగెకరాల్లో ఆ గ్రామానికి చెందిన నల్లబిల్లి బాబ్జీ, సుర్ల శివగణేశ్, సుర్ల పట్టాభిరామ్, సుర్ల నూకరాజు దౌర్జన్యంగా ప్రవేశించారని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి రాజా, సర్పంచి కుమారుడు బెనర్జీ ప్రోద్బలంతో తుని సీఐ, ఎస్సై సహా 30 మంది పోలీసులు మంగళవారం తమ భూమి వద్దకు వచ్చి, అక్కడున్న రెండు పూరిళ్లు, రెండు పశువుల షెడ్లను తొలగించారని, నాలుగు కుటుంబాలను బయటకు గెంటేసి, ఫెన్సింగ్ వేశారని ఆరోపించారు. తమ భూమిని తమకు అప్పగించాలని.. పోలీసులు, ఆక్రమణదారుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం బాధితులను పోలీసులు.. జేసీ ఇలక్కియ వద్దకు తీసుకెళ్లగా.. వినతిపత్రం స్వీకరించారు.
కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన కుటుంబాల వాదనలో వాస్తవం లేదు. నేను మద్దతిచ్చిన కుటుంబానికి 1975లో కోర్టు ద్వారా ఈ 8 ఎకరాలు వచ్చింది. ఆందోళన చేసిన కుటుంబాలకు ఈ భూమిలో నాలుగు ఎకరాలు ఉచితంగా ఇచ్చారు. వీళ్లు అక్కడ బలవంతులు. నాలుగు రోజుల క్రితం నేను మద్దతిచ్చిన కుటుంబాలకు ఉన్న నాలుగెకరాల భూమిని ఆ కుటుంబాలు ఆక్రమించి తన్నితరిమేశాయి. బాధిత కుటుంబం నా దగ్గరకు వచ్చింది. దీంతో తహసీల్దారు, సీఐని పిలిపించి డాక్యుమెంట్లు పరిశీలించి, భూమి ఎవరిదైతే వారికే ఇవ్వాలని చెప్పాను. ఆందోళన చేసిన కుటుంబాలను ఆధారాలు చూపించమనండి. ఆ 8 ఎకరాల భూమి నేను మద్దతిచ్చిన కుటుంబానిదే. తాము ఉచితంగా ఇచ్చిన భూమిపై ఆశ పడటంలేదు. వీరి భూమినే ఆందోళన చేసిన కుటుంబాలు ఆక్రమించి, తరిమేశాయి. - దాడిశెట్టి రాజా, మంత్రి
ఇదీ చదవండి: