Janasena Activists Send Money to Mudragada: రాష్ట్రంలో రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, కౌంటర్లు, రీకౌంటర్లతో ప్రతిపక్షాలపై అధికారపక్షం వారు, అధికారపార్టీపై విపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇంకోవైపు జనసేన అధ్యక్షుడి వారాహి యాత్ర కూడా అందుకు భిన్నంగా లేదు. అధికార పక్షాన్నే లక్ష్యంగా చేసుకుని.. వారు చేస్తున్న దాడులు, అవినీతి, అక్రమాలను ఎండగడుతూ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆ క్రమంలోనే కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై పవన్ పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. పవన్ కౌంటర్‌కి ఎమ్మెల్యే కూడా అదే స్థాయిలో రీకౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అందులో పవన్‌కు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. మాట్లాడే భాషలో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. అలాగే ద్వారంపూడిపై పవన్ చేసిన విమర్శలపై కూడా స్పందించారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి కాపు ఉద్యమానికి ఎంతో చేశారని.. తనపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. అంతేేకాకుండా కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబం సాయం అందించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడపై జనసైనికులు, పవన్ అభిమానులు తీవ్రస్ఖాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ప్రముఖ జనసేన నేత, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ వెరైటీగా స్పందించారు.
తాము ఎవరి రుణం ఉంచుకోమని.. ఎవరిది వారికి తిరిగి ఇచ్చేస్తాం అంటూ ముద్రగడకు ఉప్మా, భోజనం డబ్బులు తిరిగి పంపారు. అంతేకాకుండా మీరు పవన్ కల్యాణ్‌కు పంపిన లేఖలో ముద్రగడ చెప్పిన మాటలను బట్టి.. ఉద్యమ సమయంలో తాము తిన్నది ద్వారంపూడి ఉప్మా అని తేలిందని.. కనుక తాము ఆ సమయంలో తిన్న సందర్భాలు అన్నీ లెక్క పెట్టుకుంటే.. సుమారు రూ. 1000 తేలిందన్నారు. అందుకనే ఇప్పుడు ఆ ఉప్మా డబ్బులు పంపుతున్నానని.. దయచేసి ఈ డబ్బులను ద్వారంపూడికి తిరిగి ఇచ్చేయాలని ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. పంతం నానాజీ బాటలోనే మరికొంతమంది జనసైనికులు చేరారు. పంతం నానాజీతో పాటు.. ఉద్యమ సమయంలో తాము తిన్న ఉప్మాకు డబ్బులను లెక్కపెట్టి.. మరికొందరు ఆ డబ్బులను మనియార్డర్ చేశారు. దాదాపు 20 గ్రామాల నుంచి వంద మంది జనసేన శ్రేణులు ముద్రగడకు తోచిన రీతిలో డబ్బులను పంపించారు.
పవన్‌కు ముద్రగడ మరో లేఖ: ఈ క్రమంలోనే పవన్‌కు ముద్రగడ సామాజిక మాధ్యమాల వేదికగా మరో లేఖను రాశారు. మూడు పేజీల లేఖలో అనేక అంశాలను చెబుతూనే.. పవన్‌కు ముద్రగడ పద్మనాభం ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే పిఠాపురంలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. తనని తిట్టడం వల్లే సమాధానంగా లేఖ రాశానని.. దానికి అభిమానుల చేత బండబూతులతో మెసేజ్‌లు పెట్టిస్తున్నారని విమర్శించారు. అభిమానులు పెట్టే మెసేజ్‌లకు తాను భయపడిపోయి లొంగిపోయే మనిషిని కాదని.. అలా ఈ జన్మకు జరగదని తేల్చిచెప్పారు.