YCP LEADERS ON GO NO 1 : రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వైసీపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామని తమ వరకు పరిమితులు, మిగిలిన వారికి మరో రకంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. వైసీపీకి మినహాయింపు ఉంటుందేమోనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
జీవో విడుదలకు టీడీపీ వైఖరే కారణం: ప్రభుత్వానికి అన్నింటికంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని దీనికోసమే ఆదేశాలిచ్చారన్నారు. యాత్రలు ఎవరైనా చేసుకోవచ్చని, అభ్యంతరమేమీ లేదన్నారు. జీవో విడుదలకు టీడీపీ వైఖరే కారణమన్నారు. రేపు ఈ జీవోను ఉల్లంఘించి, సభలు నిర్వహిస్తే తర్వాత పరిణామాలను వారే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే తర్వాత పరిణామాలకు తెలుగుదేశం పార్టీదే బాధ్యతన్నారు. కందుకూరు, గుంటూరు దుర్ఘటనలపై బాబుకు పశ్చాత్తాపం లేదన్నారు. చావుల్లోనూ కులాలను వెతికే కుసంస్కారి చంద్రబాబు అని ఆక్షేపించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పోటీకి వస్తే ఆహ్వానిస్తాం: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సహా ఏ పార్టీ అయినా పోటీకి రావచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలూ పోటీలో ఉండడం ఆరోగ్యదాయకమేనని, బీఆర్‌ఎస్ పోటీకి వస్తే ఆహ్వానిస్తామని సజ్జల వ్యాఖ్యానించారు. సీఎం జగన్ చేస్తున్నది ధర్మయుద్ధమని, రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలనే ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ 23 మంది ఎమ్మెల్యేలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరైనా చేరవచ్చని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయరాదన్నదే తమ అభిమతమని, ఇతర పార్టీలూ దీనికి మద్దతు పలికితే అది మంచి పరిణామమేనని మరో ప్రశ్నకు సజ్జల చెప్పారు.
ఆ ఉత్తర్వులు అన్ని పార్టీలకూ వర్తిస్తాయి: రహదారులపై ర్యాలీలు, రోడ్ షోలను నియంత్రిస్తే రాజకీయ పార్టీలు అతిగా ఎందుకు స్పందిస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమని.. ఆ ఉత్తర్వులు వైకాపా సహా అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తాయని ఆయన పేర్కోన్నారు. కందుకూరు, గుంటూరులలో రోడ్ షోలు చేసి అమాయకుల ప్రాణాలు హరించారని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్, లోకేశ్ కోసం జీవోలు తీసుకురావాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు.
ఇవీ చదవండి: