YSRCP Govt Removed 4 Lakhs Pensions in AP: ఎక్కడ నెగ్గాలోకాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు. ఇదీ ఓ సినిమా డైలాగ్. సీఎం జగన్ ఈ డైలాగ్‌ను రీమిక్స్ చేసేశారు. ఎప్పుడు పెంచాలో కాదు. ఎలా తగ్గించాలో తెలిసినోడే మోసగాడని తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పారు. పింఛన్ పెంచుకుంటూ పోతానని పాదయాత్రలో నమ్మబలికిన జగన్ గద్దెనెక్కాక లబ్దిదారుల సంఖ్యను కత్తిరించుకుంటూ వెళ్లారు. వందో, వెయ్యోకాదు ఏకంగా 4 లక్షల పింఛన్లను పీకేశాడు కోతల రాయుడు జగన్. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన వివిధ వర్గాలకు ఇచ్చిన పింఛన్లను ఆపేసి, కొత్త దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి రివర్స్‌లో సంక్షేమానికి తానే బొడ్డుకోసి పేరుపెట్టినట్లు ఫోజులు కొడుతున్నారు.
బటన్లు నొక్కుతున్నాం, లెక్కలేనంత సంక్షేమం ఇస్తున్నాం, బస్సులకొద్దీ జనాల్ని తరలించి, బారికేడ్ల మధ్య కుక్కి, వారికి జగన్ చెప్పే నిర్బంధ ప్రసంగం ఇదే. మరి ఏనాడైనా ఆయన నొక్కిన స్టాప్ బటన్ల గురించి చెప్పారా. దీనిపై ఆయనే కాదు, ప్రభుత్వ అధికారులెవరూ నోరు తెరవరు. ఇప్పటిదాకా సామాజిక పింఛన్లు ఎన్ని తీసేశారని, సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే, సెర్ప్ అధికారుల నుంచి దాటవేత ధోరణి తప్ప సరైన సమాధానం రాలేదు.
వృద్ధులను, వికలాంగులను చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్ - రోడ్డున పడేశారు
లబ్దిదారుల నిరీక్షణే తప్ప మంజూరు లేదు : పింఛన్లు తీసేయకపోతే ఈ దాపరికం ఎందుకు. అదే జగన్ మార్క్ అసలు సిసలు సంక్షేమం. జగన్ ఏలుబడిలో దాదాపు 4 లక్షలకుపైనే పింఛన్లు తీసేశారని అంచనా. ఇకకొత్త పింఛన్లు జగన్ దయ లబ్దిదారుల ప్రాప్తం. జనవరి నెలలో దాదాపుగా లక్ష మంది దరఖాస్తుదారులకు పింఛను మంజూరు చేయకుండా తొక్కిపెట్టారు. 50 వేలమంది హెచ్‌ఐవీ రోగులు రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు లక్ష మంది అభయహస్తం పింఛన్ల కోసం ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. కానీ మంజూరు చేసేందుకు జగన్‌కు మనసొప్పడంలేదు.
పింఛనర్లకు జగన్ చేసిన వంచెన అంతా ఇంతా కాదు. ఏకంగా ఆరు దశల నిబంధనలు తెచ్చిపెట్టారు. తెలుగుదేశం హయాంలో ఒకే కుటుంబంలో రేషన్‌కార్డుపై ఇద్దరు పింఛనుదారులున్నా ఇద్దరికీ పింఛన్ అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా కేటగిరీ పింఛన్లకూ పరిమితి పెట్టలేదు. కానీ, జగన్ ప్రభుత్వంలో కుటుంబానికి ఒకటే పింఛన్ విధానం తీసుకువచ్చారు. ఒకే బియ్యంకార్డుపై రెండు పింఛన్లు ఉండకూడదనే, ఉత్తర్వు తెరపైకి తీసుకువచ్చి వేల సంఖ్యలో పింఛన్లు తొలగించారు. ఇలా మిగుల్చుకున్న జగన్ పింఛన్ పెంచారా. పింఛనర్ల సంఖ్యను తుంచారా.
సామాజిక పింఛన్లు నిలిపేస్తే రహదారులను అద్దంలా తీర్చిదిద్దొచ్చు : వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
ఎప్పటి పింఛన్ అప్పుడే తీసుకోవాలి లేకపోతే మర్చిపోవాలి: ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనేది పింఛనర్ల మెడకు జగన్ చుట్టిన మరో నిబంధన. చంద్రబాబు హయాంలో ఏ కారణాలతోనైనా, ఒక నెల పింఛన్ తీసుకోకపోతే, ఆ మరుసటి నెలలో పాతది కూడా కలిపి ఇచ్చేవారు. రెండు నెలలు వరుసగా తీసుకోలేకపోయినా, మూడు నెలలది కలిపి ఒకేసారి ఆ తర్వాతి నెలలో అందించేవారు. కానీ జగన్ రాజ్యంలో ఆరునూరైనా ఏ నెలది ఆనెలే తీసుకోవాలి. ఈనెల పింఛన్ తీసుకోలేకపోతే, ఆ తర్వాతి నెలో దాని గురించి మర్చిపోవడమే.
పింఛన్ పైసలనూ మిగుల్చుకుంటున్నారు : ఒకనెల తీసుకపోతే మరుసటి నెలలో ఒక నెల పింఛనే ఇస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని వలస జీవులుగా పేర్కొంటూ ఇంకొన్ని పింఛన్లు తొలగించారు. ఇలా ఎక్కడికక్కడ కోతలు వేసి వందశాతం పింఛను పంపిణీ చేస్తున్నట్లు లెక్కలు చూపించుకుంటున్నారు. కానీ, ప్రతి నెలా ఎంతో కొంత పింఛను మొత్తాన్ని మిగుల్చుకుంటున్నారు.
ONLINE CHEATING IN KANIGIRI : ఈడబ్లూటీ యాప్‌తో వైసీపీ ఆన్‌లైన్ మోసం.. పింఛన్లు సైతం స్వాహా..
ఒంటరి మహిళలకు లేని భరోసా : ఒంటరి మహిళలకూ జగన్ వేదనే మిగిల్చారు, వైఎస్సార్ పింఛను కానుక కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన భార్యకు, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛను అర్హత వయసును కుదించి వారికి ఆదరువు లేకుండా చేశారు. చంద్రబాబు హయాంలో పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛను అందించారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం 50 ఏళ్లుపైబడితేనే పింఛను ఇస్తామని 2022లో స్పష్టం చేసింది. అలా మరికొన్ని వేల పింఛన్లు ఎగిరిపోయాయి.
పింఛన్లు అంటే కేవలం ఇవి మాత్రమేనా : సామాజిక పింఛన్లంటే వృద్ధులకు ఇవ్వడమే గొప్ప అన్నట్లు జగన్ భావిస్తున్నారు. అందుకే నాలుగేళ్లలో ఏటా 250 చొప్పున వాళ్లకు తప్ప ఏ ఇతర వర్గాల పింఛన్లూ జగన్ పెంచలేదు. గత తెలుగుదశం ప్రభుత్వం చర్మకారులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, 30 ఏళ్లుదాటిన ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన హిజ్రాలకు మొదటిసారి పింఛన్లు అందజేసి కొత్త అధ్యాయం సృష్టించింది.
టీడీపీ ప్రవేశపెట్టిన పింఛన్లు ఇవే : 2018 జూన్‌లో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ సామాజికవర్గ డప్పు కళాకారులకు 15వందల రూపాయల పింఛన్ ప్రవేశపెట్టారు. ఏడాది తిరగకుండానే, అంటే 2019 ఫిబ్రవరిలో వారికిచ్చే మొత్తాన్ని 3 వేలకు పెంచారు. 2018 నవంబర్‌లో చర్మకారులకు వెయ్యి రూపాయల పింఛన్ పంపిణీని ప్రారంభించి, ఆ తర్వాత రెండు నెలలకే 2 వేలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకునే 3, 4, 5 స్టేజీ రోగులకు, మొదటిసారిగా 2017వ సంవత్సరంలో 2,500 రూపాయల పింఛన్ మంజూరు చేశారు. 2018 జులై నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకున్న వారికి సైతం ఈ పథకాన్ని వర్తింప చేశారు. 2018 జనవరిలో 18 ఏళ్లు దాటిన హిజ్రాలకు 1500 రూపాయల పింఛను మంజూరు చేశారు. సరిగ్గా ఏడాదికి ఆ పింఛను మొత్తాన్ని 3 వేల రూపాయలకు పెంచారు.
'మాకు పింఛనే దిక్కు.. తొలగిస్తే బతికేది ఎలా..?'
యాబై ఏళ్లకు పైబడిన మత్స్యకారులకు 2018లో వెయ్యి రూపాయల పింఛన్ ఇవ్వడం మొదలుపెట్టిందీ గత ప్రభుత్వమే. ఇలా అనేక వర్గాలకు కొత్తగా పింఛన్లు అందజేయడంతో టీడీపీ అధికారం నుంచి దిగిపోయే నాటికి పింఛన్ల సంఖ్య 54 లక్షలకు చేరింది. 2014-19 మధ్య ఐదేళ్ల వ్యవధిలో వివిధ వర్గాల పింఛన్ 200 నుంచి రెండు విడతల్లో 2 వేల రూపాయలకు పెరిగింది. అంటే 10 రెట్లు పెరిగింది.
పింఛన్లు ఒక్క పైసా పెంచలేదు : జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నివర్గాల పింఛన్లే ఏటా 250 రూపాయలు పెంచుతున్నారు. 80 శాతం వైకల్యమున్నదివ్యాంగులు డప్పుకళాకారులు, హిజ్రాలకు నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్కరూపాయి కూడా పెంచలేదు. పైగా పింఛన్ల విషయంలో సామాజిక తనిఖీనీ ఎత్తేశారు. ఏడాదిగా అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు. తనిఖీకి పంపిన జాబితాను సైతం జిల్లా అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. మరి పింఛనర్లకు జగన్ కొత్తగా చేసిన మేలేంటి. లబ్దిదారుల్ని కుదించడమే సంక్షేమమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
PROTEST FOR PENSIONS: పింఛన్లు పునరుద్ధరించాలంటూ.. వృద్ధుల నిరసన