YSRCP Government Continuously Runs with Debts: రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పు ముప్పు వెంటాడుతోంది. వైసీపీ సర్కార్ అసమర్థ విధానాలతో రాష్ట్రం నిరంతరం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. అప్పులపై కాగ్ హెచ్చరికలు జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రతినెలా చేబదుళ్లు, ఓడీలతోనే పాలన సాగిస్తూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు నిరంతరం సవాళ్లతోనే సాగుతున్నాయి. అప్పుల నుంచి బయటపడేందుకు మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోంది. వడ్డీలు చెల్లించేందుకు రుణాలు సమీకరించాల్సి వస్తోంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు పరిమితి దాటిపోతుండటంతో ఆ మొత్తాలు చెల్లించి బయటపడేందుకు కూడా ఆర్థిక శాఖ అధికారులు నానాతిప్పలు పడుతున్నారు. తాజా పరిస్థితుల్లోనే వేస్ అండ్ మీన్స్ నుంచి రాష్ట్ర ఖజానాను బయటకు తీసుకురావాల్సి రావడంతో కార్పొరేషన్ల ద్వారా 13వందల కోట్ల రూపాయల రుణం గురువారం ఖజానాకు చేరినట్లు తెలిసింది.
ఏ కార్పొరేషన్ నుంచి ఆ మొత్తం సమీకరించారనేది పక్కన పెడితే, శుక్రవారంలోపు చేబదుళ్ల పరిస్థితి నుంచి రాష్ట్రం బయటకు రావాల్సిన పరిస్థితులు ఉండటంతోనే ఈ రుణం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో రిజర్వు బ్యాంకు గురువారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో వెయ్యి కోట్ల రుణం తీసుకున్నారు. ఆ మొత్తం శుక్రవారం నాడు ఖజానాకు చేరుతుంది. ఇలా చేబదుళ్లు, అప్పులు, కార్పొరేషన్ల రుణాలతోనే రోజులు నెట్టుకురావాల్సి వస్తోంది.
ఇప్పటికే కాగ్ అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రం సుమారు మూడువందల రోజుల పైనే చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ వంటి వెసులుబాటుతోనే వెళ్లదీయాల్సి వస్తోందని కాగ్ గతంలోనే పేర్కొంది. ఆర్థిక నిర్వహణ సరిగా లేని కారణంగా అలాంటి అప్పులకే రిజర్వు బ్యాంకుకు వడ్డీల రూపంలో అధిక మొత్తం జమ చేయాల్సి వస్తోందని కూడా హెచ్చరించింది.
ప్రతి రాష్ట్రం రిజర్వు బ్యాంకులో కనీస నిల్వలు ఉంచాలి. ఆ పరిధిలోనే చెల్లింపులు జరపాలి. ఒకవేళ ప్రభుత్వ ఆదాయం లేకుండా చెల్లింపులు జరపాలంటే ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం ద్వారా ఎంత మొత్తం వినియోగించుకోవచ్చో.. ఆ మేరకు చెల్లింపులు చేయవచ్చు. ఉదాహరణకు SDF కింద 400 కోట్ల రూపాయల పరిమితి ఉంటే రాష్ట్రానికి ఆదాయం లేకపోయిన సరే, ఆ మేరకు చెల్లింపులు చేయడానికి ఇబ్బందులు ఉండవు. ఆ నిధి వినియోగించిన అనంతరం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు మొత్తానికి వెళ్లవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు తన రిజర్వు నిధి ఆధారంగా 952 కోట్ల రూపాయల మేర ప్రత్యేక డ్రాయింగ్ వెసులుబాటు ఉంది. ఆ మేరకు ఖజానాలో రాష్ట్ర ఆదాయం నిండుకున్న కూడా కనీస నిల్వలు లేకపోయినా చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ తర్వాత 2,252 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు పొందవచ్చు. ఆ తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ అవకాశం ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు మొత్తం ఎంత ఉంటుందో ఆ మేర ఓడీ సౌలభ్యం ఉంటుంది.
ఒక రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం 14 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. 3 నెలల కాలంలో ఇలా ఓడీ సౌకర్యం ముప్పై ఆరు రోజులకు మించి ఉండకూడదు. వేస్ అండ్ మీన్స్ పరిమితి ఎంత ఉందో అంత మేర ఓవర్ డ్రాఫ్ట్ వినియోగించుకుని 5 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించకపోతే, రిజర్వు బ్యాంకు మొదట రాష్ట్రాన్ని హెచ్చరిస్తుంది. మరోసారి కూడా ఈ పరిమితి ఇలా 5 రోజులు మించి వినియోగించుకుంటే ఆర్‌బీఐ బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తుంది. ఇప్పటికే రాష్ట్రం ప్రతినెలా చేబదుళ్లు, ఓడీలతోనే నెట్టుకొస్తోంది. ఆ గడువు పరిమితి దాటిపోతుండటంతో అప్పులు చేస్తూ ఆ మొత్తాలను అటు సర్దుబాటు చేస్తోంది. ఒక్కోసారి జీతాలు కూడా పెండింగులో ఉంచి.. ఆ అప్పులు తీర్చే పరిస్థితులూ వస్తున్నాయి.
Andhra Pradesh Debt Details: రాష్ట్ర అప్పులను మరోసారి బయటపెట్టిన కేంద్రం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఏకంగా 42 వేల 500 కోట్ల రూపాయల మేర బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంది. ఈ స్థాయిలో బహిరంగ మార్కెట్ అప్పులు గతంలో ఎన్నడు కూడా లేవు. మరోవైపు కార్పొరేషన్ల నుంచి దాదాపు 21 వేల 300 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే రాష్ట్ర రుణాలు 63 వేల 800 కోట్లకు చేరుకున్నట్లయింది. అప్పుల విషయంలో బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలు దాటిపోతున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి చేస్తున్న అప్పుల అంచనాలు ఇప్పటికే మించిపోయినట్లయింది.
AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..